కేంద్రంలో బొటా బొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపికి భాగస్వామ్య పక్షాల నుండి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిహార్ లోని జేడీయూ, ఏపీలోని తెలుగుదేశం పార్టీల నుండి బిజెపిపై ఒత్తిళ్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అవసరమైన బలం లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల మాట వినాల్సని పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని ఆసరా చేసుకుని భాగస్వామ్య పక్షాలు బిజెపిపై ఒత్తిడి పెంచుతాయని అంటున్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా ఎన్డీయే 3 ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన సంగతి తెలిసిందే. 2014,2019 ఎన్నికల్లో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి బలం ఉండడంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు బిజెపి చెప్పినట్లు నడుచుకోవలసి వచ్చింది. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలను బిజెపి గెలుచుకోలేకపోయింది. ఎన్డీయే కూటమిలో ఏపీ, బిహార్ లకు చెందిన టిడిపి, జేడీయూ లూ కీలక పక్షాలుగా ఉన్నాయి.ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, నితిష్ కుమార్ లపై బిజెపి నాయకత్వానికి పూర్తిగా నమ్మకం లేదు. అయినా వారి మద్దతు అవసరం కాబట్టి మౌనంగా వారితో చేతులు కలపక తప్పదు.
ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగాలంటే తమ మద్దతు చాలా అవసరమని అటు నితిష్ కుమార్ కు ఇటు చంద్రబాబు నాయుడికీ తెలుసు. అందుకే ఈ సారి కేంద్ర ప్రభుత్వం నుండి తమకు రావలసిన హక్కులు సాధించుకోవడంతో పాటు ప్రత్యేక నిధులు పట్టుబట్టి మరీ సాధించుకోవాలని ఈ ఇద్దరు నేతలూ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితిష్ కుమార్ కనుసన్నల్లో ఓ కీలక తీర్మానం చేశారు. బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్నది ఆ తీర్మానం సారాంశం. 2014లో ఏపీ విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీయే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి దాన్ని అమలు చేయలేదు.
ఇపుడు నితిష్ కుమార్ పట్టుబట్టారని బిహార్ కు ప్రత్యేక హోదా ఇస్తే మాకు కూడా ఇచ్చి తీరాల్సిందే అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. బిహార్ కు ప్రత్యేక హోదా కావాలన్నది ఇప్పటి డిమాండ్ కాదు. గత ఏడాది నవంబరులోనే నితిష్ ఈ డిమాండ్ చేశారు. కాకపోతే అప్పుడు ఆయన కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి బిహార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.ఈ ఏడాది జనవరిలో ఆయన కాంగ్రెస్ కూటమికి గుడ్ బై చెప్పి బిజెపితో చేతులు కలిపారు. ఇపుడు ప్రత్యేక హోదా కోసం ఆయన ఒత్తిడి పెంచితే బిజెపికి ఇబ్బందులు తప్పకపోవచ్చునంటున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సారి ఎన్డీయే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే కేంద్రం నుండి ఏమేమి సాధించుకోవాలా అని ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు అడగడంతో ఆటు విభజన హామీలయిన రైల్వేజోన్, పెట్రో కారిడార్ ల కోసం చంద్రబాబు పట్టుబట్టే అవకాశాలున్నాయి. అంతే కాదు రాజధాని అమరావతి నిర్మాణానికి ఉదారంగా నిధులు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు నితిష్ కుమార్ లు అడిగే కోరికలన్నింటినీ నెరవేర్చడం బిజెపికి సాధ్యం కాకపోవచ్చుంటున్నారు విశ్లేషకులు.
2014లో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. నీతి అయోగ్ ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిందని బిజెపి ప్రకటించింది. కొత్తగా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. అటువంటి బిజెపి ఇపుడు నితిష్ డిమాండ్ కు తలొగ్గి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా బిజెపిని గొంతెమ్మ కోరికలు కోరే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఒక విధంగా యూపీయే 2లో భాగస్వామ్య పక్షాల వైఖరితో కాంగ్రెస్ ఎలా దెబ్బతిందో ఈ సారి బిజెపికి అటువంటి ఇబ్బందే ఎదురు కావచ్చునంటున్నారు. అందుకే బిజెపి నాయకత్వం కూడా ఈ సమస్యను ఎలా అధిగమించాలా అని ఆలోచన చేస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…