7 మండలాలు – 5 గ్రామాలు

By KTV Telugu On 4 July, 2024
image

KTV TELUGU :-

విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అవ్వాలని నిర్ణయించుకోగానే బీఆర్ఎస్ పార్టీ కీలక డిమాండ్ ను తెరపైకి తీసుకు వచ్చింది. తెలంగాణ నుంచి గుంజుకున్న ఏడు మండలాలను ఏపీ తిరిగి ఇవ్వాలన్న అంశంపై మొదట చర్చించాలని ఆ తర్వాతే ఇతర అంశాలపై మాట్లాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడు మండలాలు వద్దు ఐదు గ్రామాలు చాలనే విధంగా చంద్రబాబు ముందు ప్రతిపాదనలు పెట్టడానికి సిద్ధమయింది. అసలు ఈ ఏడు మండలాలు, ఐదు గ్రామాల కథేంటి ?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశానికి రంగం సిద్ధమయింది.   వభజన సమస్యల పరిష్కారమే ఎజెండా. ఈ సమావేశం జరగడం మంచి పరిణామమేనని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రకటించారు. అయితే ఇక్కడో కీలక డిమాండ్  చేశారు. అదేమిటంటే.. విభజన సమయంలో ఏపీలో కలిపిన ఏడు మండలాల్ని మళ్లీ తెలంగాణలో కలిపేలా రేవంత్ డిమాండ్  చేయాలని ఆయన అంటున్నారు. అవన్నీ పోలవరం ముంపు మండలాలు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ మండలాలను ఏపీలో విలీనం చేశారు. అలా విలీనం చేయకపోతే పోలవరం నిర్మాణం సాధ్యం కాదని నిపుణులు చెప్పడంతో ఈ పని చేశారు.ఆ మండలాలను మళ్లీ తీసుకోవాలని హరీష్ రావు అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. ఐదు గ్రామాలు ఇస్తే చాలనుకుుంటున్నారు. ఎందుకంటే.. ఆ ఐదు మండలాల్ని తిరిగి తెలంగాణలో కలపడం అనేది అసాధ్యమనేది పార్లమెంట్ ద్వారానే జరుగుతుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. అయితే వాటిలో ఐదు గ్రామాల్ని మాత్రం తెలంగాణలో కలపాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టింది.

. ఏపీలో ఏడు మండలాలు కలపాల్సి వచ్చినప్పుడు  భద్రాచలం ఆలయ ప్రాంతాన్ని తెలంగాణకు వదిలేసి, మిగతా మండలం మొత్తం ఆంధ్రాకు కేటాయిద్దాం అని చట్టం చేశారు.  ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఏమంటే భద్రాచలం పట్టణం మొత్తం అనంటే, కేవలం భద్రాచల పట్టణం మాత్రమేనన్న సాంకేతిక పదజాలంలో తెలంగాణకు భద్రాచలం మాత్రమే ఇచ్చి, భద్రాచలంలోని పంచాయతీలు ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, భద్రాచలం నెత్తిన ఉన్న పురుషోత్తపట్నం, దానికి ఆనుకొని ఉన్న గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రానికి కేటాయించారు. ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగం.  గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుంది. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణానికి శాశ్వతంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  ఏడాదిన్నర కిందట  గోదావరికి పెద్ద సంఖ్యలో వరదలు పోటెత్తాయి. భద్రాచలం పట్టణం ముంపునకు గురైంది. ఈ క్రమంలో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఏపీకి విజ్ఞప్తి చేసింది.  భద్రాచలం పట్టణానికి ముంపు లేకుండా ఉండేందుకు ఆయా గ్రామాలను తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల పంచాయతీలు తెలంగాణలో కలపాలంటూ తీర్మానం చేసి ఎపి ప్రభుత్వానికి పంపాయి. కానీ ఏపీ వైపు నుంచి స్పందన లేదు.

కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలు… అటు తెలంగాణ, ఇటు తెలంగాణ మధ్య ఆంధ్రాలో ఉన్నాయి. భద్రాచలం నుంచి చర్ల జాతీయ రహదారి వైపునకు.. పర్ణశాలతో పాటు భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లాలన్నా… ఏపీ పరిధిలోని ఈ మూడు పంచాయతీలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి…. తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. ఈ ఐదు గ్రామాలు ముంపు గ్రామాలు కావు. అందుకే ఇచ్చేయమని తెలంగాణ  కోరుతోంది.  ఈ ఐదు గ్రామాల ప్రజలు సాంకేతికంగా ఏపీలో ఉన్నారు. కానీ వీరి అవసరాలన్నీ తెలంగాణ ప్రభుత్వమే తీరుస్తోంది.   ఐదు గ్రామాల విద్య, వైద్యం, ఉపాధి పరంగా జిల్లా కేంద్రానికి దూరమయ్యాయి.

ఈ ఐదు గ్రామాల్లోని విద్యార్థులు పదవ తరగతి చదువుకోవాలంటే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం కావాలంటే మళ్లీ భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రే సేవలు అందిస్తోంది.  ఈ గ్రామాలను ఏపీ ప్రభుత్వం తమ పరిధిలో ఉందన్న విషయాన్ని పెద్దగా  పట్టించుకోవడం లేదు. అక్కడి ప్రజలు అటు తెలంగాణకు ఇటు ఏపీకి కాకుండా పోతున్నారు. దీంతో అక్కడి గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇది రాజకీయ అంశంగానే ఉంది.  ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా.. ఐదు గ్రామాల అంశం మాత్రం పార్టీలకు ప్రచార వస్తువుగా మారిపోయాయి.

ఈ ఐదు గ్రామాల విషయంలో తెలంగాణలో కలిపేతనే మంచిదన్న అభిప్రాయం ఏపీలోనూ ఉంది. ఈ ఐదు గ్రామాలు ఏపీలో ఉండంట వల్ల ఏపీకి ఏ ప్రయోజనమూ లేకపోగా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  చంద్రబాబు , రేవంత్ రెడ్డి మధ్య చర్చల్లో పరిష్కారానికి వస్తే.. భద్రాచలం ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి