చంద్రబాబు ఏం చేయాలనుకున్నారు. ఏం చేస్తున్నారు. ఐదేళ్లు కష్టపడి వైసీపీ వాళ్ల దెబ్బలు తిన్న టీడీపీ వారి కోసం ఆయన చేస్తున్నదేమిటి. బంగారు పళ్లేల్లో పెట్టి పక్కవారికి పదవులు ఇస్తున్నారా. సొంత పార్టీ నేతలను పట్టించుకోవడం లేదా. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారి కంటే కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందా.సీ.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ నామినేషన్ ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి చంద్రబాబుకు అర్థమవుతోందా….
పేదల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు స్వయంగా సామాజిక పెన్షన్లు అందజేశారు. ఈ ఘటన అందరితోనూ ఆనందానికి కారణమైంది. ఒకే నెలలో ఏడు వేల రూపాయలు చేతికి రావడంతో పండుటాకులు ఉబ్బితబ్బిబవుతున్నారు.వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు వస్తాయన్న సంతోషం కూడా వారిలో కనిపిస్తోంది.టీడీపీ నేతలు చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకాలు కూడా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాయంత్రానికే సీన్ మారిపోయినట్లుగా అనిపించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులను ఎన్డీయే కూటమి తరపున ప్రకటించిన చంద్రబాబు కొత్త ప్రశ్నలు, కొత్త అసంతృప్తులకు కారణమయ్యారు. రెండు సీట్లు ఒక దానికి టీడీపీ అభ్యర్థిని మరో దానికి జనసేన కేండెట్ ను ప్రకటించారు. అందులో ఒకటి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ అయిన సీ. రామచంద్రయ్యకు ఇచ్చారు. ఆయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్డీయార్ , గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీలో ఉంటూ రాజ్యసభ సభ్యుడు కూడా అయినా రామచంద్రయ్య..తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. అక్కడ ఎమ్మెల్సీగా ఉంటూ చంద్రబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. ఎన్నికల ముందు మాత్రమే టీడీపీలోకి వచ్చిన నాయకుడికి పార్టీ గెలిచిన వెంటనే అవకాశం ఇవ్వడం తెలుగు తమ్ముళ్లకు ఏ మాత్రం నచ్చలేదని అంటున్నారు. టీడీపీలో వందల మంది ఎదురుచూస్తుండగా, ఎమ్మెల్యే అవకాశం రాని వాళ్లంతా ఆశపడుతుండగా… రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది చాలా మంది టీడీపీ నేతల ప్రశ్నిస్తున్నారు. బయటకు అడగలేక వాళ్లంతా కుమిలిపోతున్నట్లు సమాచారం….
పిఠాపురం వర్మ అన్యాయమైపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని వర్మ అనుచరులు ప్రశ్నిస్తున్నారు. వర్మ విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమిటి… ఇప్పుడు జరిగిందేమిటి….
2019లో వర్మ ఓడిపోయారు. ఐదేళ్ల పాటు పిఠాపురంలో పనిచేస్తూ మళ్లీ పార్టీని బలోపేతం చేశారు. 2024లో టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఎదురుచూశారు. అనూహ్యంగా అక్కడ పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో వర్మకు దిక్కుతోచలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి పిఠాపురం నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలనుకుంటే పార్టీ అధిష్టానం ఒప్పుకోలేదు. జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్ కు సహకరించాలని ఆదేశించడంతో వర్మ శివసావహించారు. పార్టీ గెలిచిన వెంటనే తొలి ఎమ్మెల్సీ మీకే ఇస్తానని చంద్రబాబు నుంచి వర్మకు హామీ వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జనసేన బ్యాచ్ తనపై దాడి చేసినప్పటికీ పార్టీ క్రమశిక్షణకు లోబడి వర్మ మౌనం వహించారు. ఐనా సరే ఎమ్మెల్సీ టికెట్ వర్మకు ఇవ్వలేదు. వర్మను పక్కన పెట్టి సీ. రామచంద్రయ్యకు అవకాశం కల్పించారు. జనసేనకు ఒక టికెట్ కేటాయించగా.. ఆ పార్టీ తరపున పిడుగు హరిప్రసాద్ కు అవకాశం లభించింది. రామచంద్రయ్య, హరిప్రసాద్ ఇద్దరూ కాపు కులానికి చెందిన వారు. ఒకే సామాజిక వర్గానికి రెండు టికెట్లు ఇవ్వడం టీడీపీ వర్గాల్లో అసంతృప్తి పెరగడానికి కారణమవుతోంది. పిఠాపురంలో తనకు సాయం చేసిన వర్మకు అవకాశం రాకుండా పవన్ కల్యాణ్ అడ్డుపడ్డారన్న టాక్ కూడా వినిపిస్తోంది. నియోజకవర్గంలో తాను తప్పితే బలమైన నాయకుడు ఉండకూడదని ఆయన నిర్ణయించుకున్నారని, అందుకే వర్మకు టికెట్ లేకుండా చేశారని కూడా చెబుతున్నారు….
వర్మ మాత్రమే కాదు.. టీడీపీలో చాలా మందికి అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది. పొత్తు ధర్మం కారణంగా కొన్ని సీట్లు పోవడంతో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ వినిపించింది. ఇప్పుడు రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో వారందరికీ పాలుపోవడం లేదు. ఏమి చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారన్న సంగతి వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…