కాంగ్రెస్ లో చేరి రాజ్యసభకు కేకే రాజీనామా చేశారు. విలువల్ని కాపాడటానికే చేశానన్నారు. మరి ఆ విలువలు ఎమ్మెల్యేలకు వర్తించవా అన్న ప్రశ్న కాంగ్రెస్కు వస్తోంది. పార్టీ మారినందున తనపై బీఆర్ఎస్ అనర్హతా పిటిషన్ వేస్తుందని ముందుగానే ఊహించి కేకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం మరి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ను చెడామడా విమర్శిస్తున్నారు. దీనికి ఆయన వద్ద సమధానం ఉందా ?
తెలంగాణ కాంగ్రెస్లో చేరికల లొల్లి ఓ వైపు ఉంటే.. తాజాగా రాజీనామాల పంచాయతీ ప్రారంభమయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామా ఆమోదించడం లాంఛనమే. పార్టీ మారినందున తనపై బీఆర్ఎస్ అనర్హతా పిటిషన్ వేస్తుందని ముందుగానే ఊహించి కేకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం మరి.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేమిటని ప్రశ్నించడం ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు. నిజానికి వారు ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడా అవకాశం వచ్చేసింది.
రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది బీఆర్ఎస్ కాదా అని కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయ్యారని కేటీఆర్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నట్లయితే.. రాజీనామాలు, అనర్హతా వేటు అనే ప్రశ్న వచ్చి ఉండేది కాదేమో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా ఒక్కో ఎమ్మెల్యేలకు కండువా కప్పుతున్నారు. ఇప్పటికి ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇంకా పదిహేను మంది వస్తారని చెప్పుకుంటున్నారు కానీ…అందరూ కలిసి వస్తే ఒకే సారి కండువా కప్పేసి ఉంటే విలీనమయ్యేది కదా అన్న అభిప్రాయం ఉంది. కానీ చర్చలు తెగకపోవడంతో వచ్చిన వారు మళ్లీ వెనక్కి వెళ్లకుండా.. ముందుగానే కండువాలు కప్పేస్తున్నారు.
ప్రస్తుతం చేరిన వాళ్లు కాకుండా మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు చేరికకు రెడీ అయ్యారని చెబుతున్నారు. అయితే ఎంత మందిని చేర్చుకున్నప్పటికీ అవి పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తాయి. మూడింట రెండు వంతుల మందిని చేర్చుకునే వరకూ ఈ సమస్య ఉంటుంది. బీఆర్ఎస్కు అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇరవై ఎనిమిది మందిని చేర్చుకుంటేనే విలీనం అవుతుంది. లేకపోతే అవదు. అంత మందిని చేర్చుకునే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టత వచ్చింది. అందుకే తాము విలీనం చేసుకుంటే కాంగ్రెస్ ఫిరాయింపులు చేస్తోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. దీనికి కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. కేకే రాజీనామాను కేటీఆర్ స్వాగతించారు. అయితే ఎమ్మెల్యేలతో ఎప్పుడు రాజీనామాలు చేయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయ్ పత్రలో ఉన్న దాన్ని ట్వీట్ చేసి ప్రశ్నించారు.
కేటీఆర్, బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వద్ద ఎదురుదాడి చేయడమే వ్యూహం. తాము కూడా విలీనం చేసుకుంటామని గట్టిగా సవాల్ చేసే పరిస్థితి లేదు. అలాగని రాజీనామాలు చేయించడం లేదా.. అనర్హతా వేటు వేయించే పరిస్థితి లేదు. అనర్హతా వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఎవరిపైనా అనర్హతా వేటు పడకపోవచ్చు. కానీ నైతికంగా బీఆర్ఎస్, కేసీఆర్కు తమ ఫిరాయింపులను సమర్థించుకునే పాయింట్ ఉంది.. కానీ కాంగ్రెస్కు మాత్రం అలాంటి అవకాశం లేదని అనుకోవచ్చు. ఓ రకంగా కేకే రాజీనామాతో కాంగ్రెస్ కు కొత్త ఇబ్బంది వచ్చి పడినట్లయింది.
రాజకీయాల్లో ఫిరాయింపులు తాత్కలిక ప్రయోజనాలను మాత్రమే పార్టీలకు ఇచ్చాయి. దీర్ఘకాలంలో నష్టాలు చేశాయి. చరిత్ర ఇదే చెబుతోంది. కానీ అధికారంలోకి వచ్చాక గుణపాఠాల్ని నేర్చుకోవడంలో పార్టీలు విఫలమవుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…