ఒక్క అడుగు !

By KTV Telugu On 9 July, 2024
image

KTV TELUGU :-

ఏపీ సీఎం చంద్రబాబు – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  ప్రజాభవన్ లో  చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రజా భవన్‌లో దాదాపుగా రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో  రెండు కమిటీలు వేసి సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.  సాగదీయకుండా ఓ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఓవరాలల్ గా చూస్తే ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకలేదు. అలాగని ఫలితం లేదని చెప్పలేము. ముందు ముందు ఎంత నిర్మాణాత్మకంగా సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతాయన్నదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం అవుతున్నారంటే ఖచ్చితంగా రాజకీయ వేడి ఉంటుంది. బీఆర్ఎస్ అలాంటి వేడిని మంటల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.  అయితే బయట ప్రచారం జరిగినట్లుగా వివాదాస్పద అంశాల జోలికి సీఎంలు వెళ్లలేదు.  భద్రచలం ముంపు సమస్య పరిష్కారం కోసం..కరకట్ట నిర్మించుకోవడానికి ఐదు  గ్రామాలను మాత్రం… ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు. అధికారులు విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించారు.  రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం కనిపించింది. అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రేవంత్, చంద్రబాబు మధ్య భేటీలో అద్భుతాలు జరుగుతాయని ఎవరూ అనుకోలేదు. కానీ ఓ రూట్ మ్యాప్ ఏర్పడుతుందని అనుకున్నారు. ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో హడావుడి చేశారు.  కానీ నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయి.

ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం ఈ దఫా చంద్రబాబు ముందుగా చొరవ తీసుకున్నారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్‌కు ఓ లేఖ రాసి 6వతేదీన కలిసి మాట్లాడుకుందాం అని ప్రతిపాదించారు. రేవంత్ రెడ్డి దీనికి సమ్మతించడంతో  మీటింగ్ ఖరారు అయింది. మొత్తం 10 అంశాలపై ఈ సమావేశం జరిగింది.  దాదాపు 60ఏళ్లు కలిసున్న రాష్టం 2014లో విడిపోయింది. తెలంగాణ ఏర్పాటై కూడా పదేళ్లు దాటినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అంతకు ముందున్న రెండు ప్రభుత్వాల్లో ఈ సమస్యల పరిష్కారానికి కొంత వరకూ ప్రయత్నాలు జరిగినా అవి ముందుకు పోలేదు.  గడచిన పదేళ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయాక విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్పటి సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. కేసీఆర్ అమరావతి ప్రారంభోత్సవానికి హాజరై సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత అంతా బాగుంటుదనుకున్నా.. రాజకీయ కారణాలతో ఇద్దరి మధ్యా బాగా దూరం పెరిగింది. ఓటుకు నోటు కేసు ఈ దూరాన్ని శాశ్వతం చేసింది . ఉమ్మడి హక్కుగా సెక్రటేరియట్‌లో వచ్చిన భవనాలను అప్పగించడానికి అప్పట్లో ఏపీ ఒప్పుకోలేదు. విభజన చట్టం 9,10 షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఆ తర్వాత అది విద్యుత్ సంస్థలు, నీటి వాటాల జగడాల వరకూ వెళ్లిపోయింది.

2019లో ఏపీలో ప్రభుత్వం మారింది. అంతకు ఆరు నెలల ముందే తెలంగాణలో రెండోసారి సీఎం అయిన కేసీఆర్ ఏపీలో చంద్రబాబును దించడం కోసం.. జగన్ కు సహకరించడం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్‌కు వచ్చిన జగన్.. అన్ని సమస్యలూ పరిష్కరించుకుంటామన్నారు. బేసిన్లు బేషజాలూ వదిలేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాయలసీమ గొంతెండుతోంది.. గోదావరి నీళ్లు తీసుకెళ్లి దానిని తడుపుదాం అంటూ.. సంయుక్తంగా అప్పటి సీఎంలు ఓ కొత్త ప్రాజెక్టును కూడా ప్రతిపాదించారు. తెలంగాణలోని సెక్రటేరియేట్ బిల్డింగులను జగన్ తెలంగాణకు అప్పగించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఏదీ ముందుకెళ్లలేదు.  చంద్రబాబు ప్రభుత్వం అంత సీరియస్ గొడవలు లేకపోయినా ఆ తర్వాత జగన్ – కేసీఆర్ కూడా అంటీ ముట్టనట్లే ఉన్నారు. ఆరునెలల క్రితం తెలంగాణలో నెలరోజుల కిందట ఆంధ్రాలో ప్రభుత్వాలు మారిపోయాయి. మళ్లీ ఇప్పుడు విభజన సమస్యలు తెరపైకి వచ్చాయి.

విభజన సమస్యలు అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేవే అయితే పదేళ్ల నుంచి కొంచం కూడా పురోగతి లేకుండా ఉండవ్. ఈ విషయాలన్నీ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిపి కూర్చోబెట్టి పరిష్కారం చేయడానికి అప్పుడు రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ ప్రయత్నించారు. ఆయన విభజన విషయంలోనూ కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన చొరవ చూపితేనే పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు ఎలా తీరతాయన్నది సందేహమే. అయితే ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే.. పరస్పరం తీవ్రంగా వ్యతిరేకుంచుకునే వ్యక్తులు ఇప్పుడు సీఎంలు గా లేరు. రేవంత్ రెడ్డి తన వంతుగా తాను పరిష్కారానికి కృషి చేశాను అనే పేరు సంపాదించాలనే తపనతో ఉన్నారు. చంద్రబాబు 2014తో పోల్చితే మరింత శక్తివంతంగా ఉన్నారు. కేంద్రంలో బలంగా ఉన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే కేంద్రంతో చెప్పి ఒప్పించగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు అప్పటితో పోల్చితే అంత భావోద్వేగమైన సమస్యలు కూడా లేవు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న కొన్ని మొండి సమస్యలను తాడో పేడో తేల్చడానికి వీళ్లు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ వారిని రాజకీయం ఎత ముందుకు తీసుకెళ్తుందన్నదే కీలకం.

ఎలాంటి పరిష్కారానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రెండు రాష్ట్రాల్లో పార్టీలు రెడీగా ఉంటాయి.  విభజన సమస్యల పరిష్కారానికి ఓ అంగీకారానికి వచ్చే ముందు ఈ అంశాన్ని రెండు అధికార పార్టీలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడే అసలు సమస్య వస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి