ఏరు దాటాక బోడి మల్లయ్యలు

By KTV Telugu On 9 July, 2024
image

KTV TELUGU :-

ఆ ఇద్దరు నేతలు తమ సీట్లను త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరికీ హామీ ఇచ్చారు. కూటమి గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటైంది. కాని ఆ ఇద్దరినీ చంద్రబాబు మరిచిపోయారు. ఎమ్మెల్సీలు, పదవులు వేరేవారికి ఇచ్చేస్తున్నారు. వారి త్యాగాలకు అర్థం లేకుండా పోయింది. త్యాగం చేస్తే త్యాగరాజుల్లా మిగిలిపోవాల్సిందేనా అంటూ నేతలిద్దరూ వాపోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలెవరో చూద్దాం.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోసం త్యాగం చేశారు. ఆయనకు ఇష్టం లేకపోయినా కూటమి పొత్తు ధర్మం ప్రకారం చంద్రబాబు మాట జవదాటలేక తాను తప్పుకుని పవన్‌ కోసం కష్టపడ్డారు. పవన్‌ పిఠాపురంలో పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించినపుడు అక్కడి టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలిచి వర్మకు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చి, కేబినెట్ హోదా కూడా ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. చంద్రబాబు హామీతో వర్మ తన ఆందోళనను విరమించి పవన్ కళ్యాణ్ ని గెలిపించారు.

అయితే కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత వర్మకి కష్టాలు మొదలయ్యాయి. వర్మకి కేబినెట్ హోదా హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తారని భావించినా నిరాశే మిగిలింది. వర్మకి నియోజకవర్గంలో ఓ వైపు జనసేన నేత నాగబాబు పవర్ కట్ చేసేశారు. అక్కడ అధికారులందరికీ ఇన్ ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పరిచయం చేశారు. పిఠాపురంలో ఏ పనైనా జనసేన ఇన్ ఛార్జ్ చెప్పినట్టే జరగాలని ఆదేశించారు. వర్మకి కేబినెట్ హోదా సంగతి తర్వాత..మొదటి రెండు ఎమ్మెల్సీల్లో ఒక్కటీ దక్కకుండా చేశారు.

దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తన రాజకీయ భవిష్యత్ పై గందరగోళంలో ఉన్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కోటా ఎమ్మెల్సీని తన రాజకీయ కార్యదర్శికి ఇప్పించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ సీటును కొద్ది నెలల క్రితమే మరోసారి పార్టీలోకి వచ్చిన రామచంద్రయ్యకి చంద్రబాబు ఇచ్చారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందే టీడీపీలో చేరిన సి రామచంద్రయ్యకి మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం టీడీపీ నేతలకు షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా కాపు, బలిజ సామాజికవర్గం నుండి ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించిన వంగవీటి రాధా వర్గానికి మరోసారి షాక్ తగిలింది. వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరినా రెండు ఎన్నికల్లో ఆయన టిక్కెట్ తీసుకోలేదు.  వంగవీటి రంగా కుమారుడైన రాధా రెండు సార్లు సీటు త్యాగం చేశాడు కాబట్టి మొదటి ఎమ్మెల్సీగా ఆయనకే అవకాశం దక్కుతుందని ఆయన వర్గం భావించింది. కానీ రాధాకి కాకుండా టీడీపీ నుండి సి రామచంద్రయ్యకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. తెలుగుదేశం పార్టీలో త్యాగాలకు విలువ లేదని, అసలు త్యాగం అనే మాట అర్థం లేనిదని..అవకాశం లాక్కోవాలి గాని..వచ్చేదాకా వేచి ఉండటం వెర్రి తనం అవుతుందని నాయకులు భావిస్తున్నారు.

ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకుల్ని మరిచిపోయి..అనేక పార్టీలు మారి వచ్చిన రామచంద్రయ్యకు ఇవ్వడం పట్ల ఆ సామాజికవర్గం నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉంటూ, పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి పార్టీలు మారేవారికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో అటు పిఠాపురం వర్మకు…ఇటు వంగవీటి రాధాకు ఆశాభంగమే మిగిలింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి