ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పాలిటిక్స్‌లో తల దూరుస్తున్నారా? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ తర్వాత యాక్టివ్ అయ్యారా? తన పాత ప్రత్యర్థి కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారా? ఎన్డీఏలో ఉంటూ..తెలంగాణలో కాంగ్రెస్‌తో అంట కాగడానికి గల కారణం ఏంటి? మరోసారి చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతానికి తెర తీసారా? తెలంగాణలో చంద్రబాబు వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణలో తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి అనుకూలంగా..తన పాత ప్రత్యర్థి గులాబీ బాస్ కేసీఆర్‌కు వ్యతిరేకంగా చక్రం తిప్పడం ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు పడే ఓటు చీలడం ఇష్టం లేక టీడీపీ అసలు పోటీయే చేయలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది. ఏపీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ అగ్రనేతల కాళ్ళా వేళ్ళా పడి కమలం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించింది టీడీపీ. అటు కేంద్రంలో..ఇటు ఏపీలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది.
అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తన శిష్యుడు రేవంత్‌రెడ్డి కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు చంద్రబాబు. తెలంగాణవాదులు ఊహించినట్టుగానే బ్యాక్ డోర్ పాలిటిక్స్ ప్రారంభించారు. తెలంగాణలో తన రాజకీయ శత్రువు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్ గా పాత టీడీపీ నేతలందరినీ ఏకం చేసే పనిలో పడ్డారు చంద్రబాబు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీలో చేరిపోయారు.
ఇక్కడ టీడీపీ మనుగడ సాధ్యం కాదని గ్రహించి వారంతా సైకిల్ దిగి కారు ఎక్కేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబును బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికపూడి గాంధీ కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఒకప్పుడు టీడీపీ నేతలే. బీఆర్ఎస్ ను దెబ్బతీసే లక్ష్యంలో భాగంగా పాత టీడీపీ నేతలందరినీ కాంగ్రెస్ లోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటనే చర్చ సాగుతోంది. ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ నేతలు, అందులో భాగస్వామి అయిన జనసేన తెలంగాణ నేతలు తమ రాష్ట్రానికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును చాలా లైట్ తీసుకున్నారు. ఆయనను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. తన మిత్రపక్షాల నేతలతో సమావేశం కాని చంద్రబాబు…తన కూటమికి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం తెలంగాణలో హాట్ హాట్ చర్చకు కారణమైంది.
తెలంగాణ టీడీపీ పగ్గాలు దక్కించుకోవాలని ఓ మాజీ టీడీపీ నాయకుడు వెళ్ళి చంద్రబాబును కలిసారు. అయితే ఆయన్ను కాంగ్రెస్‌లో చేరాలని చంద్రబాబు చెప్పడంతో కంగుతిన్నారు. రెండు కళ్ల సిద్దాంతంతో చంద్రబాబు గతంలో చాలా నష్టం చేశారని..ఇప్పుడు మరోసారి రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడం ప్రమాదకరమని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…