షర్మిల తీరుపై కేటీఆర్ విమర్శలు

By KTV Telugu On 11 July, 2024
image

KTV TELUGU :-

ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఓడిపోయారు. ఆయన ప్రజలకు అన్నీ రకాలుగా సాయం చేశారు కదా అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ  ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. ఆయన టచ్ చేసిన వాటిలో  ఏపీ పాలిటిక్స్ కూడా ఒకటని చెప్పాలి. జగన్ రెడ్డి విజయం దాకా వచ్చి ఓడిపోయారని, తృటిలో ఓటమి పాలయ్యారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జగన్ పార్టీకి 40 శాతం ఓట్ షేర్ వచ్చిందని అది మామూలు విషయం కాదని కేటీఆర్ విశ్లేషించారు. మూడు పార్టీలు కూటమిగా  పోటీ చేయడం వల్లే జగన్ ఓడిపోయారని కేటీఆర్ అంటున్నారు. అదే పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, జగన్ స్వల్ప మెజార్టీతోనైనా గెలిచి ఉండేవారని కేటీఆర్ లెక్కలు చెప్పారు. చంద్రబాబుకు సీఎం అయ్యే సీన్ ఉండేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.

షర్మిలపై కేటీఆర్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆమె  సొంత అన్నకు వ్యతిరేకంగా  పనిచేశారన్నారు. కొందరు నేతలు షర్మిలను పావుగా వాడుకుని జగన్ ఓడించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆమె ఇతరులకు ఉపయోగపడ్డారే తప్ప తనకు తాను ఏమీ చేసుకోలేకపోయారని కూడా కేటీఆర్ విశ్లేషించారు. నిజానికి జగన్ నేతృత్వ వైసీపీ, తెలంగాణలోని బీఆర్ఎస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. వాస్తవానికి జగన్ కు కేసిఆర్, కేటీఆర్ సమర్థింపు చాలా కాలంగా ఉన్నదే. 2019 ఎన్నికలకు ముందు  జగన్ కు కేసీఆర్ ఓపెన్ సపోర్టు ఇచ్చారు. జగన్ ను గెలిపించడం ద్వారా చంద్రబాబును రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అప్పట్లో ప్రకటించి ఆ పని చేసి చూపించారు.తర్వాతి కాలంలో విభజన సమస్యలపై జగన్ మౌనం వహించి… కేసీఆర్ కు ప్రయోజనం కలిగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జగన్ గెలిస్తాడని కేసీఆర్ జోస్యం చెప్పారు.అయితే ఆయన ఓడిపోయారు. ఐనా బీఆర్ఎస్, వైసీపీ మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. జగన్ కు కష్టమొస్తే కేసీఆర్  కుటుంబం అది తమ సమస్యగా భావిస్తుందన్న ఆరోపణ చాలా రోజులుగా ఉంది. అందుకే జగన్ ఓటమిపై కేటీఆర్ పాజిటివ్ విశ్లేషణ చేశారు…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి