తెలంగాణాలో మంత్రి పదవులకోసం సీనియర్ల పైరవీలు

By KTV Telugu On 12 July, 2024
image

KTV TELUGU :-

తెలంగాణాకు కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేయాలనుకుంటోన్న కాంగ్రెస్ హై కమాండ్ కు మంత్రి వర్గ కూర్పు  తలనొప్పిగా మారిందట.

మంత్రి పదవుల కోసం పలువురు సీనియర్లు  క్యూలు కట్టారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఓ కొలిక్కి  వస్తేనే కానీ అధ్యక్ష పదవిని భర్తీ చేయకపోవడమే బెటరని హైకమాండ్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.. అధ్యక్ష పదవి రేసులో మధుయాష్కీ, జగ్గారెడ్డిలు ముందంజలో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా రెండు పదవుల్లోవున్న రేవంత్‌ రెడ్డి తనకు అధ్యక్ష పదవినుంచి విముక్తి కల్పించాలని ఢిల్లీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది.  రాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా మూడు సంవత్సరాలైన నేపథ్యంలో కొత్త అధ్యక్షున్ని ఎన్నుకునే సమయం ఆసన్నం కావడంతో ఇక ఆ పదవిని వేరొకరికి ఇవ్వాలని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌ ఎంపికతోపాటు మంత్రివర్త విస్తరణ కూడా వుండడంతో ఈ రెండు అంశాలపై తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.  ఆయా పదవులు ఎవరికి దక్కుతాయనేదానిపై రాజకీయ పరిశీలకులు ఎవరి అంచనాలు వారు చేస్తున్నారు

అయితే అందరికీ తెలిసిన విషయమే..అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను వారు వారి వారి స్థాయిలో వినియోగించుకుంటూ వుండడంతో ఆయా పదవుల ఎంపిక ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎవరికి వారు ఆయా పదవులపై కన్నేయడంతో వారి మధ్యన సయోధ్య లోపించడమే మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమవుతోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతల వ్యవహార శైలి కారణంగా మంత్రి వర్త విస్తరణ , పీసీసీ చీఫ్‌ ఎంపిక కసరత్తు పెండింగులో పడిందనే గుసగుస కాంగ్రెస్ నేతల మధ్య జోరుగా సాగుతోంది.

త్వరలో ఉంటుందని అందరూ భావిస్తున్న మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు నల్లగొండ జిల్లా నేతలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు.  ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లానుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి  రేవంత్‌ మంత్రివర్గంలో వున్నారు.  ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఉమ్మడి జిల్లా నేతలు మాకూ మంత్రి పదవి కావాల్సిందేనని గట్టిగా పట్టుపడుతున్నారు.

వారిలో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఈ సారి తనకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనేదానిపై ఆయన తనదైన వాదనను గట్టిగానే వినిపిస్తున్నారని సమాచారం.

బిజెపికి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో అధికారంలోకి రాగానే తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారట.  అంతే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో భవనగిరి పార్లమెంట్ సీటును గెలిపించుకొని వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి వుంటుందని మరోసారి ఢిల్లీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారట. పార్టీ పెద్దలఆదేశాల మేరకు  పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి సీటు గెలుపు బాధ్యతను భుజస్కంధాలపై వేసుకొని భారీ మెజారిటీతో గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి మరోసారి పార్టీ పెద్దలకు గుర్తు చేస్తున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో సీనియర్ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రంగంలోకి దిగడమే ఈ ట్విస్ట్‌కు కారణం.  కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా వున్నారని, రాజగోపాల్ రెడ్డి తన అవసరం మేరకు కాంగ్రెస్ పార్టీ వదిలి బిజెపిలోకి వెళ్లారని..తిరిగి తన అవసరం మేరకు బిజెపిని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారని ఉత్తమ్‌ తన వాదన వినిపిస్తున్నాడని తెలుస్తోంది  కోమటిరెడ్డి కుటుంబానికే రెండు మంత్రి పదవులు ఇస్తే..పార్టీకి చాలా విధేయతగా వుంటూ దశాబ్దాలుగా సేవలందించిన తన కుటుంబానికి కూడా రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని ఆయన మెలిక పెట్టినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్లపాటు పీసీసీ చీఫ్‌గా పని చేశానని…పార్టీ అప్పగించిన ప్రతిపనిని సమర్థవంతంగా నిర్వహించానంటూ ఆయన పార్టీ పెద్దల దగ్గర పదే పదే ప్రస్తావించినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  తాను కూడా తక్కువోడినేమీ కానని,  నల్లగొండ పార్లమెంట్ ఎన్నిక బాధ్యతను బాధ్యతగా తీసుకొని రికార్డ్‌ మెజారిటీతో గెలిపించినట్టు చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ఛాన్స్‌ ఇచ్చేలాగా వుంటే తన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి అవకాశం కల్పించాలని ఆయన ఢిల్లీ పెద్దల ముందు సవినయంగా తన డిమాండ్ను వినిపించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇచ్చిన ఈ తాజా ట్విస్ట్‌కు ఏం చేయాలో తెలియక ఢిల్లీ పెద్దలు సైలెంట్‌ అయిపోయినట్టు తెలుస్తోంది.

మంత్రి విస్తరణకు సంబందించి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పెట్టిన మెలికకు తోడు మరో మెలిక తాజాగా చోటు చేసుకుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ తాను కూడా మంత్రి వర్గ రేసులో వున్నట్టు చెబుతున్నారు.  మంత్రివర్గంలో లంబాడా సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని ఆయన హైకమాండ్ దగ్గర తన డిమాండ్‌ సున్నితంగా, స్పష్టంగా వినిపించారట.

మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆరు పదవుల్ని నింపాల్సి వుంది. వీటిని ఆయా సామాజిక, ప్రాంత సమీకరణాల ఆధారంగా భర్తీ చేయాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆరులో మూడు బెర్తులు తమకే కావాలని నల్లగొండ జిల్లా నేతలు పట్టుబడుతుండడంతో ఏం చేయాలో తెలియక పార్టీ హైకమాండ్‌ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.  కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న సామెతలాగా కాంగ్రెస్ మంత్రి పదవుల పంపిణీ కార్యక్రమం తయారైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విసర్తరణ పీసీసీ అధ్యక్ష ఎంపిక పనులను కొంతకాలంపాటు వాయిదా వేయాలని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి