రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేదని ఒక సామెత ఉంది. జగన్ పాలనలో అరాచకాలను భరించలేక గద్దె దింపి టీడీపీని తెచ్చుకుంటే ఇప్పుడు కూడా వైసీపీ బ్యాచ్ పెత్తనం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పాలనా వ్యవస్థలో కొన్ని చోట్ల వైసీపీ ఎంట్రీ ఇచ్చేసినట్లు చెబుతున్నారు. పేరుకు టీడీపీ మంత్రులే ఉన్నప్పటికీ వ్యవస్థను నడిపించేదీ మాత్రం నిన్నటి వైసీపీ బ్యాచ్ అని ఒక బలమైన చర్చ నడుస్తోంది. గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దని చంద్రబాబు స్వయంగా ఆదేశించినప్పటికీ ఆ మాటలు బేఖాతరు చేస్తూ వైసీపీతో అంటకాగిన వారినే పీఏలుగా, ఓఎస్డీలుగా పెట్టుకుంటున్నారు. గత ఐదేళ్లూ వైసీపీ హయాంలో జరిగిన అన్ని అరాచకాలూ, అక్రమాలూ, దౌర్జన్యాల్లో భాగస్వామ్యం ఉన్న అధికారులే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ మంత్రుల వద్ద పాగా వేస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందులోనూ.. అత్యంత వివాదాస్పద అధికారిగా వైసీపీ హయాంలో పనిచేసిన రిటైర్డు ఐఏఎస్ రాజాబాబు ఇప్పుడు ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేషీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అన్ని పనులు చూసుకునే మంత్రి పీఎస్ వేరే పార్టీ సానుభూతిపరుడైతే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోవాలి. మంత్రులను ఎలా తప్పుదోవ పట్టించి.. సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీకి చేర్చుతారో అర్థం చేసుకోవాలి. జగన్ ఆనవాళ్లు పడితే ఎలా ఉంటుందో ఓ సారి అంచనా వేసుకోవాలి. ప్రభుత్వం మారుతున్న తరుణంలో ఫైళ్లను ఎలా తగులబెట్టారో కళ్లకు కట్టినట్లు చూసుకోవాలి. అలాంటివన్నీ వదిలేసి వైసీపీతో చెట్టాపట్టాలెసుకున్న పీఏలు, ఓఎస్డీలను ఇప్పుడు మంత్రులు పక్కన కూర్చొబెట్టుకుంటున్నారు. ఎంత కొత్త మంత్రులైతే మాత్రం అనుభవజ్ఞులైన పీఏల కోసం వైసీపీ బ్యాచ్ ను పెట్టుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నే. గతంలో పీఎస్, ఓఎస్డీల నియామకంలో చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలను ఇప్పుడు గాలికి వదిలేశారు. వెరిఫికేషన్ లేకుండా నేరుగా తమ పేషీలో చేర్చుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. వారంతా జగన్ కాలంలోని అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను మాయం చేసేందుకు వస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు టీడీపీ ప్రభుత్వంలో చొరబడేందుకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలను సైతం తారుమారు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మంత్రికి మంచిపేరు వచ్చినా, చెడ్డ గుర్తింపు వచ్చినా అది పీఎస్ లు, ఓఎస్డీల వల్లే జరుగుతుంది. అందువల్ల ఉన్నంతలో సమర్థులను, నిజాయితీపరులను మాత్రమే పేషీల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు కోరుతున్నాయి. దీనికి భిన్నంగా కొన్న శాఖల్లో పరిణామాలు ఉండటం పట్ల ఆందోళన చెందుతున్నాయి.ఇక వైసీపీ వీరవిధేయ నేతగా పేరు తెచ్చుకున్న సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సన్నిహితులే అన్నిచోట్లా వాలిపోతున్నారు. వీరిలో కొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక కూడా అనుకూలంగా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరికొందరికి ఇంటెలిజెన్స్ నివేదిక అనుకూలించకపోయినా కొనసాగిస్తున్నారు. మరోవైపు గత ఐదేళ్లు టీడీపీ కోసం నిలబడిన వారిపై కేసులున్నాయంటూ పక్కన పెడుతున్నారు. దానితో మంత్రులు మంత్రులు అనిత, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర కార్యాలయాల్లో ఎవరు చేరుతున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం.. సీఎంఓ..ఆరా తీస్తున్నట్లు సమాచారం…
ఇదిలా ఉండగా టీడీపీ ఎంపీలకు కూడా ఈ సెగ తప్పడం లేదు. నిన్నటి వైసీపీ ఎంపీలకు పీఏలుగా పనిచేసిన వాళ్లు ఇప్పుడు ఉద్యోగం, ఉపాధి కోసం టీడీపీ ఎంపీల చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీ నుంచి గలీ దాకా తమకు అంతా తెలుసని.. తమను వ్యక్తిగత సహాయకులుగా పెట్టుకుంటే అంతా చూసుకుంటామని నూరిపోస్తున్నారు. దానితో ఇప్పుడు టీడీపీ ఎంపీలు ఆలోచనలో పడిపోయారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…