బంధుత్వంలో గందరగోళం ఏర్పడింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి మధ్య దూరం పెరిగింది. జగన్ తీరుపై అవినాష్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అన్న కోసం కడప ఎంపీ సీటు వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఒక్క సారి రాజీనామా చేస్తే ఇక శంకరగిరి మాన్యాలు పట్టుకుపోవాల్సిందేనని అవినాష్ అనుమానిస్తున్నారు. పదవికి తాను దూరంగా జరిగితే.. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లాల్సిందేనని అవినాష్ భయపడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మొహం చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు అవినాష్ వెనుకాడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనితో కడప వైసీపీ శ్రేణులు తీవ్ర అయోమయానికి లోనవుతున్నారు.పార్టీ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు…
వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొత్త ఎత్తుగడలు ఫలించేవిగా కనిపించడం లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేందుకు ఇష్టపడని జగన్ రెడ్డి, ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన ఆంతరంగికులు అంటున్నారు. ఈ మేరకు మీడియాలో జరిగిన ప్రచారాన్ని కూడా జగన్ రెడ్డి, ఆయన బ్యాచ్ ఖండించలేదు. మౌనమే అంగీకారం అన్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అక్కడ నుంచి తాను పోటీ చేయాలన్నది జగన్ రెడ్డి ప్లాన్ అని చెబుతున్నారు. తాను ఖాళీ చేసే పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి భార్య భారతిని బరిలోకి దించాలని జగన్ అనుకుంటున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీ అందుకు కౌంటర్ కూడా సిద్ధం చేసింది. అవినాష్ రాజీనామా చేసి కడప ఉప ఎన్నిక వస్తే జగన్ రెడ్డికి పోటీగా మళ్లీ షర్మిలను బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సంగతి చెప్పడంతో ఆ ప్రయత్నాలకు ఒక ఊపు కూడా వచ్చింది.పైగా ఊరూరా ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించి వైసీపీ నేత గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఉరిమి ఉరిమి తన నెత్తిన పిడుగు పడుతుందని ఆయన భయపెడుతున్నారు…
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతున్న కొద్దీ జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. నిజానికి ఈ సారి కడప ఎంపీ టికెట్ అవినాష్ కు ఇవ్వకూడదనుకున్నారట. అయితే కడప సిస్టర్స్ షర్మిల, సునీత కలిసి చేసిన యాగీ కారణంగా… అవినాష్ ను ఆపేస్తే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న అనుమానంతో ఆయన్ను కొనసాగించాల్సి వచ్చిందట. ఇప్పుడు మాత్రం ఏదో విధంవగా అవినాష్ ను వదిలించుకోవాలని జగన్ చూస్తున్నట్లు సమాచారం….
వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ తీరుపై జగన్ రెడ్డికి కూడా చాలా అనుమానాలున్నాయని అంతరంగికుల సమాచారం. ఒక్క సారి నెత్తినెత్తుకున్న తర్వాత దించలేని పరిస్థితుల్లో ఆయన్ను కొనసాగించాల్సి వచ్చిందని చెబుతారు. అవినాష్ అబద్ధాలు చెబుతున్నారని జగన్ రెడ్డి అనుమానిస్తూ వచ్చారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కూడా జగన్ భావించారు. అయితే షర్మిల, సునీత కలిసి.. అవినాష్ ను తనను కలిపి దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారని ఆ క్రమంలో వాళ్లు కొంత సక్సెస్ అయ్యారని జగన్ రెడ్డి గుర్తించారు. దానితో అవినాష్ ను డ్రాప్ చేస్తే.. కొత్త ప్రచారానికి అవకాశం ఇచ్చినట్లవుతుందని భయపడి ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే అవినాష్ గెలవడం ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అవినాష్ ను ఏ క్షణాన్నైనా కోర్టు అనుమతితో సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తన మెడకు కూడా ఆ కేసు చుట్టుకునే వీలుందని జగన్ రెడ్డి భయపడుతున్నారు.ఇంతలోనే తనను వదిలించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా అవినాష్ గుర్తించారట. జగన్ ఆదేశాలను పాటించి రాజీనామా చేయాల్సి వస్తే ఇక తనను ఎవరూ పట్టించుకోరని అవినాష్ భయపడుతున్నారు. కడప ఎంపీ పదవి పోగొట్టుకుని, పులివెందుల ఎమ్మెల్యే కూడా కాలేకపోతే తనకు అథోగతేనని ఆయన భయపడుతున్నారు. వివేకా కేసు ఉచ్చు బిగుసుకుంటే..తనను దేవుడు కూడా కాపాడలేడని, జగన్ రెడ్డి తనను పట్టించుకోకుండా వదిలేస్తారని అవినాష్ భయపడుతున్నారు. అందుకే కడప ఎంపీ స్థానాన్ని వదులుకునేందుకు ఇష్టపడకుండా ఆయన మొహం చాటేస్తున్నారు…
ఏదైనా అవినాష్ రెడ్డి కొంతకాలం జగన్ రెడ్డికి కనిపించకుండా ఉండాలనుకుంటున్నారు. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలిసొస్తున్నాయి. బ్రదర్స్ పై ఆరోపణలు సంధిస్తూ వారిని మరింత ఇరకాటంలో పెడుతున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…