కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడేవారిలో అధికారులు ముందుంటారు.
కంగ్రాచ్యులేషన్స్ సర్ అంటూ పూలబొకేలిచ్చి చిరునవ్వులు చిందిస్తూ వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటారు. పాత పరిచయాలను గుర్తు చేస్తూ సదరు నేతల గుడ్ బుక్స్‌లోకి ఎక్కడానికి నానా పాట్లు పడుతుంటారు.
నెల్లూరు జిల్లా అధికారులు కూడా అదే పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా మీకు సహకరించాం కదా సార్ అంటూ జిల్లానేతలను ప్రసన్నం చేసుకొని అల్లుకుపోయేవాళ్లు తమకు నచ్చిన చోటకు బదిలీలు చేయించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారట.
నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి మంత్రులయ్యారు. ఆ వెంటనే వారి చుట్టూ అధికారులు తిరగడం సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అందులో వింతేమీ లేదు. ఐతే ఇక్కడో ఒక ట్విస్ట్. మంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్లు చాలా తక్కువగా వున్నారట. చాలా మంది అధికారులు జిల్లాకు చెందిన మంత్రులనుపట్టించుకోకుండా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రవద్దకు వెలుతున్నారని తెలుస్తోంది. ఇదే మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనాయణ రెడ్డిలకు రుచించడం లేదని జిల్లా రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రంటే చంద్రబాబునాయుడకు ప్రత్యేకమైన ప్రేమ.. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు కూడా పక్క చూపులు చూడకుండా పార్టీతోనే ఉన్నారని అందుకే రవిచంద్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారట. ఆ విషయం జిల్లా అధికారులకు బాగా తెలుసుకాబట్టి మంత్రులను పెద్దగా పట్టించుకోకుండా తమ తమ పనులకోసం బీదను కలిసి వినతులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీద రవిచంద్రంటే జిల్లాకు చెందిన మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి గుర్రుగా వున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పొంగూరు నారాయణ అమరావతికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో జిల్లా అధికారులందరూ బీద రవిచంద్ర కనుసన్నల్లోనే నడిచేవారు. చంద్రబాబునాయుడు కూడా అధికారుల బదిలీల వ్యవహారాలన్నీ బీదకే అప్పగించారని అప్పట్లో టాక్ నడిచింది. దీంతో గత టీడీపీ ప్రభుత్వంలో బీద కీలకంగా వ్యవహరించారు. తాజాగా టీడీపీ అధికారంలోకి రాడంతో గతంలో లాగే ఈ సారి కూడా బీదా రవిచంద్ర లైమ్‌లైట్‌లోకి వచ్చి తన సత్తా చాటుతున్నారు.
దాంతో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు తమ బదిలీలకు, ఇతర పనులకు సంబంధించిన వినతులను ఆయనకే ఎక్కువగా ఇస్తున్నారు. ఈ వ్యవహారంలపై ఇద్దరు మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది..
అధికారుందరూ బీదాను కలవడంపై ఇద్దరు మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని టిడిపి నేతలు చెప్పుకుంటున్నారు.
ఇక తమకు మంత్రి పదవులు ఎందుకు ..వాటిని బీద రవిచంద్రకే అప్పజెప్పితే సరిపోతుంది కదా అని వారు వాపోతున్నట్టు జిల్లాలో వినిపిస్తున్న గుస గుస.
పక్క జిల్లాలకు బదిలీ అయిన అధికారులు మళ్లీ తమ స్వంత గూటికి వచ్చేందుకు బీద రవిచంద్ర చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు..
వారి వద్ద నుంచి రవిచంద్ర వినతులు కూడా స్వీకరిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపికి అనుకూలంగా పనిచేసిన వారెవ్వరు..? చేయనివారు ఎవరు? అనే దానిపై కసరత్తు చేసి ఒక జాబితాను సైతం ఆయన సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు సన్నిహితంగా ఉండేవారికి ప్రాధాన్యత కల్గిన ప్రాంతాల్లో పోస్టింగ్ లు ఇప్పించేందుకు రవిచంద్ర సిద్దమైనట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇద్దరు మంత్రులతో చర్చించి బదిలీలపై నిర్ణయం ఉంటుందని బీద రవిచంద్ర తన అనుచరులు వద్ద చెబుతున్నారట.. అయితే ఇద్దరు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం బీదా తీరుపై అసహనంతో వున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రుల తీరును బీద అనుచరులు తప్పు పడుతున్నారు. జిల్లాలో సీనియర్లు అందరూ పార్టీకి దూరంగా ఉన్న సమయంలో బీద రవిచంద్రే పార్టీని బలోపేతం చేశారని…అలాంటి నేతను మంత్రులు తప్పుగా అర్ధం చేసుకోవడం ఏమిటని బీద అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద అధికారుల బదిలీల వ్యవహారం, మంత్రుల ఇగోలు తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిల్చేలా కనిపిస్తున్నాయనే టాక్ టీడీపీ నేతల్లో జోరుగా నడుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…