లోక్ సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ చేసుకున్న అంతర్గత విశ్లేషణలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడటంతో పాటు భారీ ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 17 స్థానాలుండగా ఎంఐఎం గెలిచే హైదరాబాద్ పోగా మిగతా 16లో కనీసం 14 గెలవాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. అన్ని చోట్ల కాకపోయినా 12 స్థానాల్లో సునాయాస విజయం ఉంటుందని, ఒకటి రెండు అదనంగా వచ్చినా ఆశ్చర్యం లేదని టీమ్ రేవంత్ అంచనా వేసుకుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకే పరిమితమై ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సాధించింది.అదే బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాలను రెట్టింపు చేసుకుని ఎనిమిదికి చేరడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ ట్రా దిశగా అడుగులు వేసింది. అందులోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలు సాధించిన కమలనాథులు ఏకంగా ఎనిమిది లోక్ సభా స్థానాలకు ఎగబాకడం ఆశ్చర్యకర అంశంగా పరిగణిస్తున్నారు. ఫలితాల ను విశ్లేషించి ఒక నివేదికను సమర్పించేందుకు ఏర్పాటైన కురియన్ కమిటీ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.. టన్నుల కొద్దీ దుమ్మెత్తి పోసుకున్నారు…
నియోజకవర్గాల వారీగా కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు హాజరై…తమ వాదన వినిపించగా, ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో పరిస్థితి విని కమిటీ పెద్దలే ఆశ్చర్యపోయారు. కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్లుగా పాలమూరు ఓటమికి పలు కోణాల్లోఆరోపణలు వెల్లువెత్తాయి. మహబూబ్ నగర్ లోక్ సభా పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు సహకరించలేదని, సీఎం రేవంత్ స్వయంగా నిలబెట్టిన అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలంతా గ్రుపులుగా విడిపోయి ముందుకు, వెనక్కి లాగుతూ పార్టీ పరాజయానికి కారణమయ్యారని ఆయన అన్నారు. అయితే వంశీచంద్ రెడ్డి తగవులు పెట్టిన కారణంగానే పార్టీ ఓడిపోయిందని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. మరో పక్క మహబూబ్ నగర్లో పార్టీ ఓటమికి బీఆర్ఎస్ కుట్రలో కారణమని కొందరు అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఓటింగ్ కు ముందు బీఆర్ఎస్ వ్యూహం మార్చి.. కొంత మంది సానుభూతిపరుల చేత బీజేపీకి ఓటేయ్యించిందని అందుకే వంశీ ఓడిపోయారని కొందరన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య లోపాలకారి ఒప్పందం జరిగిందని కమిటీ ముందు వారు వాదించారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎంతో స్నేహం పార్టీకి దెబ్బతీసిందని ఫిరోజ్ ఖాన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఐఎంను శత్రువుగా చూసినప్పుడే హైదరాబాద్లో బతికి బట్టకట్టే వీలుంటుందని ఆయన తేల్చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లలో ఒకరిద్దరు మినహా ఎవరూ లోక్ సభ ఎన్నికల్లో సహకరించలేదని, తూ తూ మంత్రంగానే పనిచేశారని కొందరు ఆరోపించారు. అందుకే బయట నుంచి వచ్చిన దానం నాగేందర్ సైతం సికింద్రాబాద్ లోక్ సభలో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. పార్టీలో ప్రక్షాళన అవసరమని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. ఐనా సరే కష్టపడి పనిచేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెజార్టీని తగ్గించగలిగామని ఆయన ధీమాగా చెప్పారు. ఇక వెలిచాల రాజేందర్ రావు, జీవన్ రెడ్డి ఓటమికి వెన్నుపోటే కారణమని కమిటీ ముందు నేతలు తేల్చేశారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…