టిటిడి ఛైర్మన్ పదవి కోసం పోటీ

By KTV Telugu On 15 July, 2024
image

KTV TELUGU :-

టీటీడీ ఛైర్మన్ పదవి ఏపీని పాలక కూటమిలో చిచ్చు రేపుతోంది. చైర్మన్ పదవి కోసం ఒకవైపు జనసేన..మరోవైపు బీజేపీ పట్టు పడుతున్నాయి. ఇక టీడీపీలోనే పలువురు నేతలు ఆ ఒక్క పదవి చాలంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. నలుగురు నాలుగు వైపుల నుంచి ఒత్తిడి తెస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏంచేయాలో దిక్కు తోచడంలేదట. ఛైర్మన్ పదవి ఒక్కటే కాదు నాలుగైదు బోర్డ్‌ మెంబర్ పదవులు కూడా అడుగుతున్నాయట బీజేపీ, జనసేన పార్టీలు

ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మాండ నాయకుని ఆలయం ట్రస్ట్‌ కమిటీ ఛైర్మన్ పదవి అంటే అదో గొప్ప గౌరవం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఛైర్మన్ పదవి కోసం అధికార కూటమిలోని అనేక మంది నాయకులు పట్టు పడుతున్నారు. ఇప్పుడు ఈ పదవే కూటమి పార్టీల్లో చిచ్చు రగిల్చింది. ఆ పదవి మాకంటే మాకంటూ..టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి తమకు ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాగబాబు కోసం ఈ పదవి అడుగుతున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా టిటిడి చైర్మన్ పదవికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆ పదవిపై నాగబాబు చాలా ఆశలు పెట్టుకున్నారంటున్నారు. నాగబాబు కోరికమేరకే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గట్డిగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. టిటిడి చైర్మన్ గా నాగబాబు ఖరారయ్యారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని కొన్ని రోజుల క్రితం నాగబాబు ఖండించారు. అయితే తాను రేసులో లేనని‌ మాత్రం ఆయన ఎక్కడా ప్రకటించలేదు. టిటిడి చైర్మన్ పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుంది. టిటిడి నిబంధనల ప్రకారం రెండోసారి కూడా అవకాశం ఇవ్వచ్చు. అంటే అవకాశం వస్తే రెండేళ్ల నుంచి నాలుగేళ్లపాటు చైర్మన్ గా వుండొచ్చు.

కేంద్రం వద్ద లాబీయింగ్ కి టిటిడి చైర్మన్ పదవి చాలా కీలకమని భావించడంతోనే జనసేన‌ గట్టిగా పట్టుబడుతోందంటున్నారు. వాస్తవానికి ఎన్నికలకి ముందు జనసేనకి కేటాయించిన మూడు ఎంపిలలో నాగబాబు అనకాపల్లి ఎంపిగా పోటీ చేస్తారని ముందుగా వార్తలొచ్చాయి. అయితే అనుహ్యంగా కూటమి నేతల సర్దుబాటు కోసం‌ నాగబాబు ఆ సీటుని వదులుకున్నారు. పైగా మూడు స్ధానాలకి బదులు జనసేన రెండు లోక్ సభ స్ధానాల్లోనే పోటీ చేసి అనకాపల్లి స్ధానాన్ని బిజెపికి త్యాగం చేసింది. ఎంపి‌ కావాల్సిన నాగబాబు బిజెపి, టిడిపి కోసం తన సీటు వదులుకున్నారని…ఆయనకే టిటిడి చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్ జనసేన‌ నుంచి గట్టిగా వినిపిస్తోంది.

టిటిడి చైర్మన్ పదవికి ఉన్న ప్రాదాన్యత దృష్ట్యా ఆ పదవిని తమ దగ్గరే ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే టిడిపిలో సైతం టిటిడి చైర్మన్ పదవి కోసం పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు టీడీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, రఘు రామకృష్ణంరాజు ఇద్దరూ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో టిటిడి బోర్డు మెంబర్ గా చేసిన అనుభవంతో వేమిరెడ్డి ప్రశాంతి చైర్ పర్సన్ పోస్ట్‌ ఇవ్వాలని చంద్రబాబుని‌ కోరుతున్నారట. ఇప్పటి వరకు చైర్మన్ పదవిని మహిళకి కేటాయించిన దాఖలాలు లేవు.

ఇక రఘురామకృష్ణంరాజు కూడా ఢిల్లీ లావీయింగ్ కోసం టిటిడి చైర్మన్ పదవే తనకి కరెక్టని భావిస్తూ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం‌ కొందరు బిజెపి ప్రముఖులతో కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని టాక్…ఇక ఇదే రేసులో కొత్తగా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేరు తెరపైకి వచ్చింది. గత చంద్రబాబు హయాంలో యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ చైర్మన్ గా పనిచేశారు. టిడిపిలో యనమల అత్యంత సీనియర్ నాయకుడు, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు చెబుతున్నారు.

అయితే యనమల మాత్రం గవర్నర్ గిరీ కోసం‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అది సాద్యపడకపోతే రాజ్యసభకి వెళ్లడం యనమల డ్రీమ్. కాని రెండేళ్ల వరకు ఎపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశం లేకపోవడంతో ముందుగా ఇపుడు టిటిడి చైర్మన్ కట్టబెడతారని చెబుతున్నారు.ఇక గతంలో అశోక్ గజపతిరాజు పేరు వినిపించినప్పటికీ ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గావుండటంతో సాంకేతికంగా టిటిడి చైర్మన్ పదవి ఇవ్వడం సాద్యపడదని తెలుస్తోంది…

అటు జనసేన…ఇటు సొంత పార్టీ నేతల గురించి ఆలోచనల మధ్య టిటిడి చైర్మన్ విషయంలో సిఎం చంద్రబాబు తర్జన భర్జనలు పడుతున్నారంటున్నారు. అదే సమయంలో తెరపైకి కొత్త ప్రతిపాదన చేస్తున్నారంటున్నారు. మొదటి రెండేళ్లు టిడిపికి..తర్వాత రెండేళ్లు జనసేనకి టీటీడీ ఛైర్మన్ పదవి కేటాయించాలనే ప్రతిపాదన తెస్తున్నారు. అయితే దీనిపై జనసేన అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇక టిటిడి బోర్డు మెంబర్లలో సైతం జనసేన, బిజెపి గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన చైర్మన్ పదవి కాకుండా కనీసం అయిదారు బోర్డు మెంబర్లు కావాలని డిమాండ్ చేస్తుంటే.. బిజెపి కూడా నాలుగు నుంచి అయిదు మెంబర్లు కోరుతున్నారట.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి