దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితిపై ఉపఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిని బీజేపీ తెచ్చుకుంది. మరో నెలన్నరలోపే ఉపఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. దీంతో బీజేపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్లుగా ముందు ముందుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు కానీ.. మరో నాలుగై నెలల్లో జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుదో అంచనా వేయడం కష్టం అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకూ అంతా మోదీ హవానే నడిచింది. కనీ ఇప్పుడు ఆ మోదీ మానియా మసక బారుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీకి ఆది నుండే సవాళ్లు మొదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు బలం పుంజుకున్నాయి. ఉపఎన్నికల్లో అది మరోసారి బయటపడింది. ఈ ఏడాది చివరలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అటు బిజెపికి, ఇటు ప్రతిపక్ష ఇండియా వేదికకు ఈ ఎన్నికలు తొలి అగ్నిపరీక్షగా నిలవబోతున్నాయి. ఇక వచ్చే సంవత్సరం ప్రారంభంలో రాజధాని ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయి. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ద్వయం నుండి బిజెపి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సెప్టెంబరులో బీహార్‌లో శాసనసభ ఎన్నికల సమరం జరుగుతుంది.
మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయం కారణంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడింది. బీజేపీ పుణ్యమా అని.. అక్కడ రెండు శివసేన పార్టీలు, రెండు ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. నిజానికి రెండు ప్రాంతీయపార్టీలను చీల్చి వాటి డూప్లికేట్స్ కు అసలైన హోదా ఇప్పిస్తే.. అసలైన పార్టీలు అంతర్ధానం అయిపోవు. ప్రాంతీయ పార్టీలు ఆధారపడేది ఓ నేత మీద లేదా కుటుంబం మీద. వేరే వారికి ఆ పార్టీని కట్టబెట్టినంత మాత్రాన ప్రజలు మారిపోరు. ఇప్పుడుఅదే మహారాష్ట్రలో కనిపిస్తోంది. ఉద్దవ్ నేతృత్వంలోని అసలైన శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని అసలైన ఎన్సీపీ మళ్లీ పట్టు నిరూపించుకున్నాయి. షిండే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి. ఆ మూమెంట్ ను పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకుని జెండా పాతాలని కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే … పూర్తిగా బలహీనపడుతుంది.
పార్లమెంట్ తొలి సమావేశాలను గమనిస్తే మున్ముందు యుద్ధ వాతావరణం తప్పకపోవచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. రెండు పదవీ కాలాల్లో మోదీ రైతులు, సైనికుల ఛాంపియన్‌గా ప్రచారం చేసుకున్నారు. ఈ రెండు తరగతుల వారు ఎక్కువగా నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బిజెపికి ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. అన్నదాతల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తానని మోడీ ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. మోడీపై సైనికులు, వారి కుటుంబాల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న అహంకారపూరితమైన నిర్ణయాలు, తొందరపాటు చర్యలే దీనికి కారణం. త్రివిధ దళాల్లో ఉద్యోగుల నియామకం కోసం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం తీవ్ర విమర్శను చవిచూసింది. వ్యవసాయ చట్టాల మాదిరిగానే దీనిపై కూడా పెద్దగా ప్రభుత్వం చర్చ జరపలేదు. తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం మరింత గందరగోళాన్ని సృష్టించింది.
పూర్తి సంఖ్యాబలం లేనప్పుడు, ప్రతిపక్షాల నుండి ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కోవడం, సమస్యలను పరిష్కరించడం అంత తేలిక కాదు. గతంలో మాదిరిగా అధికారాన్ని చెలాయించడం ఇప్పుడు సాధ్యం కాదు . అదే వరుసగా బలహీనపడుతున్న సంకేతాలు వస్తే అసలు సాధ్యం కాదు. ప్రాంతీయపార్టీలు గొంతెమ్మ కోరికతో తెరమీదకు వస్తాయి. అందుకే ఇండి కూటమి పార్టీలు మోడీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని హెచ్చరిస్తున్నాయి. ఆ రకంగా చూస్తే బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికలే చివరి టెస్ట్ అనుకోవచ్చు.
రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరే అధికారంలో ఉండలేరు. ప్రజలకు కూడా బోర్ కొడుతోంది. మోదీ మూడో సారి గెలవడం అద్భుతం. నాలుగోసారి అసలు చాన్సే ఉండదన్న సంకేతాలు.. మూడో సారి గెలిచినప్పటి నుండి కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…