మాట మార్చుతున్న టీడీపీ అధినేత

By KTV Telugu On 2 August, 2024
image

KTV TELUGU :-

1980ల్లో… హ్యాండిచ్చాడు అనే మాట చాలా మంది వాడేవారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఎగ్గొట్టిన వారిని హ్యాండిచ్చాడు, చెయ్యిచ్చాడు అనే వారు. అప్పు తీసుకుని టైమ్ కి తిరిగి ఇవ్వకపోయినా హ్యాండిచ్చాడు అని అనేవారు. ఇప్పుడు ఏపీ పాలన విషయంలో మళ్లీ అదే మాట అనాల్సి వస్తోంది. ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఆరు గ్యారెంటీలను జనంలోకి తీసుకువెళ్లిన చంద్రబాబు ఇప్పుడు ఒకటి మినహా మిగతా వాటి ఊసే ఎత్తడం లేదు. అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీ అజెండాలో ఆరు గ్యారెంటీలు ఉన్నాయా లేదా అన్న అనుమానం వస్తోంది. జగన్ తరహాలోనే చంద్రబాబు పట్టుకొచ్చిన డబ్బు అంతా జీతాలు, పెన్షన్లకే వ్యయం చేస్తున్నారని తాజా గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. 40 రోజుల్లో 12 వేల కోట్లు అప్పు తెచ్చిన బాబు ఇప్పుడు పెన్షన్ల పంపిణీపై చూపిన వేగం.. గ్యారెంటీల అమలుపై ప్రదర్శించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి….

చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించారు. అప్పుడు తన మనసులో మాట చెప్పేశారని ఏపీ ప్రజల్లో చాలా మంది చర్చించుకుంటున్నారు. చేయాలని ఉంది, కాకపోతే చేతులు కట్టేసినట్లుగా ఉన్నాయని చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి చేయాలంటే చేతిలో చిల్లిగవ్వ లేదని… జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి వెళ్లారని చంద్రబాబు వాపోయారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తనకు ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుందని చెప్పుకున్న చంద్రబాబు అప్పటి వరకు హామీల విషయంలో కాస్త నిదాన వైఖరే ఉంటుందని సంకేతమిచ్చారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సూప‌ర్ -6 ప‌థ‌కాల అమ‌లు వ్య‌వ‌హారం.. ఇప్ప‌టికీ సందిగ్ధంగానే ఉంది. అమ‌లు చేసే విష‌యంపై నాయ‌కులు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు.పింఛ‌న్ల‌ను పెంచ‌డం, త‌ల్లికి వంద‌నం పేరుతో స్కూలుకు వెళ్లే ప్ర‌తిచిన్నారికీ 15000 చొప్పున ఇవ్వడం, నిరుద్యోగ భృతి కింద 3000 ఇవ్వ‌డం, మ‌హిళ‌ల‌కు ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం, రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ కింద ఏటా 20 వేలు చెల్లించడం, ఆడ‌బిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మ‌హిళ‌ల‌కు 1500 చొప్పున నెల నెలా ఇవ్వ‌డం లాంటి ఆరు హామీలను చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారని అనుకున్నప్పటికీ అది ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ప్రస్తుతానికి పింఛన్ల పెంపు అమలవుతోంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశం ఉంది. ఆరు గ్యారెంటీల్లో లేని అన్న క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకు మించి చేయబోతున్నదేమీ లేదని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడితే చూద్దామన్నట్లుగా చంద్రబాబు ధోరణి ఉండగా.. ఆ సంగతి హామీలు ఇచ్చేప్పుడు తెలియదా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు జరిపి తీరాల్సిందేనని కమ్యూనిస్టు పార్టీలు కూడా కోరుతున్నాయి.చంద్రబాబు మాత్రం ససేమిరా అంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి