పాత వర్గీకరణ – కొత్త సమస్యలు

By KTV Telugu On 2 August, 2024
image

KTV TELUGU :-

ఎస్సీల్లో ఉప వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాదిగ సామాజికవర్గం ప్రజల్లో కొత్త ఆశలకు అవకాశం ఇచ్చింది. మూడు దశాబ్దాల ఉద్యమం ఫలితంగా తమకు న్యాయం జరుగుతుందని వారు ఎదురుచూస్తున్నారు. వర్గీకరణ పూర్తయిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సహేతుకమైన డిమాండ్ ను ప్రభుత్వం ముందు పెడుతుండగా, పూర్తి చిత్తశుద్ధితో వర్గీకరణను అమలు చేస్తామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఐనా సరే అనేక ప్రశ్నలు మాత్రం జనాన్ని వెంటాడుతున్నాయి. ఏదీ సాధ్యం, వర్గీకరణ అమలు ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్నలు తక్షణమే తలెత్తాయి…..

కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరదించి మంచి పనే చేసింది. షెడ్యూల్ కులాలు,షెడ్యూల్డు తెగల ఉప వర్గీకరణ ఆమోద యోగ్యమేనని, ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉప వర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మెజారిటీ తీర్పును వెలువరించింది. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని, అందులో సామాజికంగా, విద్యాపరంగా మరింత వెనుబడిన వర్గాలు ఉన్నాయని, వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చరిత్రాత్మక తీర్పులో ఆరుగురు నాయమూర్తులు అభిప్రాయపడ్డారు. మరి అమలు ఎలా జరుగుతుందన్నదే పెద్ద సమస్య. నిజానికి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆ తీర్పునకు అనుగుణంగా కులాలవారీగా రిజర్వేషన్లను అమలు చేయడంపై దృష్టి పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందిన గెజిట్ ప్రకారం ఎస్సీలకు ఇప్పుడు అమలు చేస్తున్న మొత్తం 15 % రిజర్వేషన్‌లో మాదిగలకు 7 %, మాలలకు 6 %, రెల్లి తదితర కులాలకు 1 %, ఆది ఆంధ్రులకు 1 % చొప్పున వర్తిస్తుందని ఒక మాట వినిపిస్తోంది. ఎస్సీలను మొత్తం నాలుగు గ్రూపులుగా అప్పటి ప్రభుత్వం విభజించడంతో రెల్లి తదితర 12 కులాలు ‘ఏ’ గ్రూపులో, మాదిగ సహా 18 కులాలు ‘బీ’ గ్రూపులో, మాల సహా మొత్తం 25 కులాలు ‘సీ’ గ్రూపులో, ఆది ఆంధ్ర సహా నాలుగు కులాలు ‘డీ’ గ్రూపులో ఉన్నాయి. ఈ వర్గీకరణ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలోనే రూపొంది దాదాపు ఐదేండ్ల పాటు అమలైనందున ఇప్పుడు ఇరు ప్రభుత్వాలు దాన్నే అమలు చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇప్పుడు వెలువడిన జాబ్ నోటిఫికేషన్లలో సైతం రిజర్వేషన్ మార్పుల కోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని తెలంగాణ సీఎం ప్రకటించి కొత్త ప్రశ్నలకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 1997లోనే కులాలను నాలుగు గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది. ప్రత్యేకంగా ఆర్డినెన్సును రూపొందించి 1999 డిసెంబరు 9 నుంచి అమలు చేసింది. ఆ తర్వాత 2000 మే 2వ తేదీన గెజిట్ జారీ కావడంతో పూర్తిస్థాయిలో అమలైంది. కానీ సుప్రీంకోర్టు కోర్టు 2004లో ఈ ఉత్తర్వులను కొట్టేయడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలో పరిస్థితి మొదటికొచ్చింది…

సుప్రీం కోర్టు తీర్పులో అనేక షరతులు ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఉప వర్గీకరణ అమలు చేయడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోకూడదని అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. మరి వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ ఎలా అమలు చేస్తారో చూడాలి…

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ మంది మాదిగలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా మాలలు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎస్సీలు మొత్తం 54.32 లక్షలు ఉంటే అందులో మాదిగలు 32.22 లక్షలు, మాలలు 15.27 లక్షలు అనే లెక్కలు వెలువడ్డాయి. దీంతో వర్గీకరణ ద్వారా మాదిగలకు 7 % రిజర్వేషన్ దక్కినా సరైన న్యాయం లభించదనేది మాదిగ సంఘాల వాదన. జనాభా లెక్కల ప్రకారం కనీసంగా 12 % రిజర్వేషన్ మాదిగలకు దక్కాల్సి ఉంటుందని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అది సున్నితమైన అంశం అవుతుంది. అంటే ఎస్సీ రిజర్వేషన్ ను 15 శాతానికి మించి అమలు చేయాల్సి ఉంటుంది. నిజానికి తెలంగాణలో మాలలకంటే రెట్టింపు స్థాయిలో మాదిగలు ఉన్నప్పటికీ రిజర్వేషన్‌ కేవలం 1 % తేడా మాత్రమే ఉన్నదని, వర్గీకరణ ద్వారా మాదిగల కంటే మాలలే తెలంగాణలో ఎక్కువ లబ్ధి పొందుతారన్నది కొన్ని సంఘాల వాదన. మాల, మాదిగల మధ్య రిజర్వేషన్ ఫలాల అసమానతలను రూపుమాపేందుకు వర్గీకరణ డిమాండ్ తెరపైకి వచ్చినా ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించినా..ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కులాల లెక్క ఒక వంతయితే… స్థూలంగా ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తారన్నది మరో సమస్య. క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేస్తూ.. ఒక సారి రిజర్వేషన్ పొందిన కుటుంబానికి మరో సారి అవకాశం రాకుండా చూడాలని కోర్టు తీర్పు చెప్పడంతో ప్రభుత్వాలు దాన్ని ఎలా అమలు చేస్తాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి క్రీమీలేయర్ విధానం అమలు చాలా జటిలమైనది. ఎక్కడ ఎవరు లబ్ధి పొందారని నిర్ధారించడం మామూలు విషయం కాదు ఒకరు రిజర్వేషన్ ఉపయోగించుకున్నంత మాత్రమే వారి కుటుంబం మొత్తం బాగుపడిపోయిందని, సంపన్నులైపోయారని మైక్రో లెవెల్లో లెక్కలు తీయడం సులభం కాదు. ఈ క్రమంలో కులగణన కూడా కొంత మేర ఉపయోగపడుతుందని వాదించేవారున్నా..అది అంత సులభం కాకపోవచ్చు. ఐనా సరే రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన తర్వాత మరింత స్పష్టత వస్తుందని, అప్పుడు జనాభా నిష్పత్తిలో అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తి సంపూర్ణంగా దక్కుతుందని కొందరు అంటున్నారు…

విద్య, సామాజిక సంక్షేమం, ఉపాధి కల్పనకు సంబంధించి రాష్ట్రాలకు అధికారాలు ఉన్నపుడు ఉప కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించాలన్నది సుప్రీం కోర్టు తీర్పు ప్రధానాంశాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ తేల్చేశారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని ప్రకటించినా మొత్తం వ్యవహారం అమలు తీరుపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు ఎలా చేస్తాడో చూడాలి. ఎందుకంటే ఎవరికీ అన్యాయం జరగకుండా అమలు చేయాల్సిన అనివార్యత ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి