ప్రతిపక్ష వైసీపీ సభ్యులే టార్గెట్‌గా.. చంద్రబాబు స్కెచ్ రెడీ చేస్తున్నారు. చెప్పడానికి నీకైనా ఉండాలి.. వినడానికి మాకైనా ఉండాలి. అని అనుకుంటున్నారా! కచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే.. వైసీపీకి వచ్చిందే 11. అందులో టార్గెట్ చేయడానికేముంటుంది.. అని అనుకోవచ్చు. కానీ.. బాబు ఫోకస్ చేస్తుంది ఎమ్మెల్యేలపై కాదు. వైసీపీ రాజ్యసభ ఎంపీలపై! ఇప్పటికే.. 16 మంది ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న బాబు.. ఇప్పుడు రాజ్యసభలోనూ టీడీపీ వాయిస్ వినిపించేలా అడుగులు వేస్తున్నారా? అనే చర్చ మొదలైంది. ఉన్నట్టుండి.. బాబు రాజ్యసభ ఎంపీలపై ఎందుకు ఫోకస్ పెట్టారు అనేదే మెయిన్ క్వశ్చన్. రాజకీయాలంటేనే అంత.. పొలిటీషియన్లు ఏది చేసినా.. దానికో లెక్క ఉంటుంది. అందులోనూ.. చంద్రబాబు లాంటి కటౌట్ ఒక డెసిషన్ తీసుకొంటున్నారంటే.. దాని వెనుక కచ్చితంగా రాజకీయ వ్యూహం దాగి ఉంటుంది. నిజానికి.. సొంత బలంతో మరో రెండేళ్ దాకా టీడీపీకి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం లేదు. అందుకే.. ప్రత్యర్థి వైసీపీని ఖాళీ చేయించే పని మొదలు పెట్టారనే చర్చ జరుగుతోంది. బాబు గురి తప్పకపోతే.. కొద్ది రోజుల్లోనే ఏపీ పొలిటికల్ పిక్చర్ మారే చాన్స్ ఉంది.
రాజ్యసభలో తెలుగుదేశానికి ఒక్క సభ్యుడు కూడా లేరని.. ఫీలైపోతున్న తెలుగుదేశం.. ఆ లోటును భర్తి చేసుకునేందుకు భారీ స్కెచ్‌నే రెడీ చేసింది. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో కొందరికి వల వేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అటు నుంచి కూడా కొందరు ఎంపీలు.. బాబు గారి గేట్లు ఎత్తితే చాలు.. వచ్చేస్తాం అన్నట్లుగా ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ.. వైసీపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇప్పుడు.. ఆ పార్టీకి ఉన్న బలమల్లా.. రాజ్యసభ ఎంపీలు మాత్రమే. కేంద్రంలో.. బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ సభ్యుల బలం లేకపోవడంతో.. కీలక బిల్లుల విషయంలో తమ అవసరం ఉంటుందనే లెక్కల్లో ఉంది వైసీపీ. ప్రస్తుతం.. తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో కీలక అంశాల్లో కేంద్రం సహకారం తీసుకోవాలని చూస్తోంది. ఇప్పుడిదే.. బలాన్ని తగ్గించి.. వైసీపీకి చెక్ పెట్టేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఓ నలుగురైదుగురు ఎంపీలు.. త్వరలోనే తెలుగుదేశంలోకి జంప్ కొడతారనే ఊగాహానాలున్నాయ్.
వైసీపీ.. రాజ్యసభ ఎంపీల్లో కీలకంగా నలుగురు నేతలున్నారు. అందులో.. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన పరిమల్ నత్వానీ.. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. వీళ్లు కాక.. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు, గొల్ల బాబూరావు, మేడా రఘురామిరెడ్డి, ఆర్. కృష్ణయ్య ఎంపీలుగా ఉన్నారు. వీరిలో.. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం మరో రెండేళ్లలో ముగియనుంది. గొల్ల బాబూరావు, రఘురామిరెడ్డికి ఇంకా ఆరేళ్ల సమయం ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యకు నాలుగేళ్ల సమయం ఉంది. వీళ్లలో.. కొందరు టీడీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో.. కొందరు గతంలో టీడీపీలో పనిచేయడం వల్ల.. వాళ్లకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో.. వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. తమ ఎంపీలను కొనేందుకు.. టీడీపీ వందల కోట్లు రెడీ చేస్తుందనే ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మొత్తానికి.. టీడీపీ గనక ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపితే.. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు రెండేళ్ల నిరీక్షణ అవసరం లేదనే విషయం తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే వైసీపీ నుంచి రాజ్యసభ ఎంపీలను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇలా పార్టీలోకి వచ్చేవారికి.. అవే పదవులిస్తారా? లేక.. వేరే ఆల్టర్నేట్ ఏమైనా చూపిస్తారా? వారి స్థానంలో ఇప్పుడున్న టీడీపీ నేతల్లో కొందరిని రాజ్యసభకు పంపుతారా? అనేది చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…