జనసేన హామీలు అమలు చేయాలంటున్న జోగయ్య

By KTV Telugu On 6 August, 2024
image

KTV TELUGU :-

అనుకున్నదొక్కటీ ఐనదొక్కటీ అన్నట్లుగా ఉందీ ఏపీలో కూటమి  ప్రభుత్వం పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం తప్పిదాలని ఎండగడుతూ శ్వేతపత్రాలు విడుదల చేసినంత సులభంగా పాలన సాగించలేమని టీడీపీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అధికారాన్ని చేపట్టి రెండు నెలలు కావస్తున్న తరుణంలో కూటమిలోని ఇతర పార్టీలతో పాటు వారి సానుభూతిపరుల నుంచి టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. ఒక పక్క నామినేటెడ్  పదవుల విషయంలో జనసేనతో పేచీ కొనసాగుతుండగానే.. ప్రభుత్వానికి హామీలు అమలు రూపంలో గండం ఖాయమనిపిస్తోంది. తప్పును టీడీపీపైకి నెట్టి జనసేన చేతులు దలుపుకునేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తల నడుమ.. హామీల అమలు ఎలాగో అర్థం కాక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు….

తల్లికి వందనం పేరుతో చేస్తామన్న సాయంపై ఎటువంటి కసరత్తు జరగడం లేదు. మరోవైపు ఖరీఫ్ ప్రారంభమై చాలా రోజులవుతోంది. కొద్ది రోజుల్లో సీజన్ ముగియనుంది. అన్నదాత సుఖీభవ పేరిట 20వేల రూపాయలు అందిస్తామన్న పథకానికి అతిగతీ లేదు. మహిళలకు నెలకు 1500 రూపాయల సాయం విషయంలో ఒక సైతం స్పష్టత లేదు. అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు ఉంచి.. కొంత నిధులు సమీకరించి పథకాలు అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అయితే పింఛన్ల మొత్తాన్ని పెంచి వరుసగా రెండో నెల అందించడంలో మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు పెండింగ్ లో ఉండగా.. ఇప్పుడు జనసేన ప్రకటించిన షణ్ముఖ వ్యూహం పథకాలను అమలు చేయాలని జనసేన పక్షం  వహించే  హరి రామ జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన లేఖ రాశారు. షణ్ముఖ వ్యూహంలో భాగంగా కీలక పథకాన్ని అమలు చేయాలని కోరారు.

నిజానికి జనసేన పరంగా పవన్ కళ్యాణ్ ఒక మేనిఫెస్టోను రూపొందించారు. దానికి షణ్ముఖ వ్యూహంగా పేరు పెట్టారు.  ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చే సౌభాగ్య పథకం గురించి హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే పథకాన్ని అమలు చేయాలని హరి రామ జోగయ్య పట్టుబడుతున్నారు. సంపద చేకూర్చే ఈ పథకం వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ఒక్క టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు మాత్రమే అమలు చేస్తారా? షణ్ముఖ వ్యూహం మాటేంటి? అని హరి రామ జోగయ్య ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాల రచయితగా పేరుపొందిన  హరిరామజోగయ్య లేఖ రాయడం కొత్తేమీ కాకపోయినా ఈసారి మాత్రం ఎవరి ప్రోద్బలంతోనే ఆయన లేఖాస్త్రాన్ని సంధించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో తను అనుకున్నది జరగలేదన్న  కోపంతో ఉన్న హరిరామ జోగయ్యను ఇంకెవరో రెచ్చగొడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలుగన్న జోగయ్యను పవర్ స్టార్ దగ్గరకు రానివ్వకపోవడంతో ఆయన బాగా కసి మీదున్నట్లుగా చెబుతున్నారు. ఎలాగైనా కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టాలని డిసైడయ్యారని, ఆయనకు వైసీపీలో ఒక బ్యాచ్ సలహాలిస్తోందని టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలను జోగయ్యకు గుర్తు చేసినదీ వాళ్లేనని చెబుతున్నారు. ఏదో విధంగా పవన్ కల్యాణ్ ను కూడా ఊబిలోకి లాగితే  ఆట రసవత్తరంగా ఉంటుందని వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. వైసీపీ ట్రాప్లోకి జోగయ్య పడిపోయారని అంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి