20 శాతం పెరిగిన కరోనా కేసులు, లాక్ డౌన్ భయాలు..! 

By KTV Telugu On 12 August, 2024
image

KTV TELUGU :-

2020లో ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ -19 మళ్లీ విజృభించబోతోంది.అదీ మళ్లీ మహమ్మారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఆదమరిస్తే అనర్థమన్న సంగతి ప్రపంచ సమాజం గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు, పర్యాటకం పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు లేకపోతే కష్టమన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇండియాలో అంతగా కనిపించకపోయినా విదేశాల ప్రభావం మన కంట్రీపై కనిపించడం ఖాయమని తేలిపోయింది….

కొవిడ్ -19 కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. కొవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని.. దీనిపై పునరాలోచన చేయాలని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. “కోవిడ్ ఇప్పటికీ మనతోనే ఉంది” అని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ మరాయ వాన్ ఖెర్ఖోవ్ మీడియాతో అన్నారు. 84 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులో పెరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సీజన్ తో సంబంధంలేకుండా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ నిగ్గుతేల్చింది. పారిస్ ఒలింపిక్స్ లో కనీసం 40 మంది అథ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు నెలలో కరోనా కేసులు 20 శాతం పెరిగాయి. టెస్టులు చేసిన వారిలో 10 శాతం మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఇదీ కొంత మేర ఆందోళనకరమైన అంశమైనని తక్షణ చర్యలు చేపట్టని పక్షంలో వైరస్ వేగంగా వ్యప్తి చెందే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు…

డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌లో కొత్త ఇన్ఫెక్షన్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా రాకపోకలు ఎక్కువగానూ, జనాభా గణనీయంగానూ ఉండే భారత్ కు ముప్పు పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి..

కొవిడ్ మాయమైందని ఎవరన్నా అనుకుంటే వాళ్లు తప్పులో కాలేసినట్లే అనుకోవాలి. చైనా, ఇండియా, యూరప్, అమెరికా సహా పలు దేశాల్లో మళ్లీ వ్యాపిస్తోంది. కొత్త ఇన్ఫెక్షన్లు, వేరియంట్లతో భయం పెరుగుతోంది. అవి ఎంత త్వరగా విస్తరిస్తాయో అంచనా వేయలేని పరిస్థితి వైద్య నిపుణుల్లో నెలకొంది. భారత దేశంలోనూ కొవిడ్ భయం ఉంది. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ జరగని పరిస్థితుల్లో ఇంకెంతమందికి కొవిడ్ వచ్చిందో చెప్పలేకపోతున్నారు. జులై, ఆగస్టు లెక్కలపై ఇంకా స్పష్టత రాకపోయినా, ప్రపంచ దేశాల పరిస్థితిని చూస్తే మాత్రం కొత్త అనుమానాలు రాకమానవు. మనదేశంలోకి బయట నుంచి రాకపోకలు ఎక్కువ. రోజూ లక్షల మంది విమాన ప్రయాణీకులు వస్తూ ఉంటారు. వారి ద్వారా కొవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే విమానాశ్రయాల్లో మొక్కుబడి టెస్టింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దానితో విదేశాల్లో నివురు గప్పిన నిప్పులా కరోనా విజృభిస్తే..మనకు కూడా ఇబ్బందేనన్న ఆందోళన కనిపిస్తోంది. నిజానికి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే గత 12-18 నెలల్లో వ్యాక్సిన్‌ల లభ్యత గణనీయంగా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. పైగా వ్యాక్సిన్ పంపిణీ కూడా దాదాపుగా ఆగిపోయింది.

దేశంలో మరోసారి మహమ్మారి విజృభించకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరిద్దరు మాత్రమే ఇప్పుడు మాస్క్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నట్లుగా ముందుజాగ్రత్తలు అవసరమన్నది మరిచిపోకూడదు. మరి ఆ సంగతి ప్రభుత్వాలకు అర్థమైతే కొంత నిర్బంధం ద్వారానైనా కొవిడ్ ను అరికట్టే వీలుంటుంది..

https://youtu.be/K2ywiLErW0Q?si=tgp3T6xai7WIVQmX

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి