గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరిన ఆయన ఆ పార్టీలో ఉన్నట్టా.. ఘర్ వాపసీగా బీఆర్ఎస్ కు వెళ్లిపోయినట్లా.. మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారన్న మాట నిజమేనా.. అసలు కృష్ణమోహన్ ఏం చేస్తున్నారు. ఆయన ఇష్టపడి ఏ పార్టీలో ఉంటున్నారు. రాజకీయ భవిష్యత్తు ఏమిటి..
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టే క్రమంలో వచ్చిన పలువురు ఎమ్మెల్యేల్లో కృష్ణమోహన్ రెడ్డి కూడా ఒకరు. కేటీఆర్ ను కలిసి ఘర్ వాపసీ అని చెప్పుకున్న కృష్ణమోహన్ మరో సారి పీఛే ముడ్ అనేందుకు ప్రయత్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో అల్పాహార సమావేశంలో కాంగ్రెస్ పునరాగనమానికి సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ను వీడిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని గద్వాల ప్రజలు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాను ధరించలేదు. నియోజకవర్గంలోని ఆయా మండలాలలో పర్యటించే సమయాలలోనూ ఆయన అభిమానులు గాని, కాంగ్రెస్ వాదులు కానీ పార్టీ కండువాను కప్పలేదు. ఎమ్మెల్యే మెడలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కండువా లేకపోవడం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పుడు గాని, తిరిగి బీఆర్ఎస్.. ఆపై మళ్లీ కాంగ్రెస్ లో చేరినప్పుడు గాని కృష్ణమోహన్ రెడ్డి పార్టీల మార్పులకు సంబంధించి ఎటువంటి వివరణలు ఇవ్వలేకపోవడం ఆసక్తిని రేపుతోంది. అక్కడక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప, ప్రభుత్వ పనితీరును గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు.
కాంగ్రెస్ పెద్దల నుంచి పలు హామీలు తీసుకుని పార్టీలో చేరిన కృష్ణమోహన్ వ్యూహాత్మకంగా ఇప్పుడు దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ముందు జాగ్రత్త ఉన్న మనిషి అన్న వాదన వినిపిస్తోంది..
కృష్ణమోహన్ రెడ్డి రాకను గద్వాల్ కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన వస్తే తాము ఉండబోమని చెప్పేశారు. దానితోనే ఆయన మళ్లీ బీఆర్ఎస్ వైపుకు చూశారని తెలిసింది. అయితే అన్ని సర్దుకుంటాయని, సమస్యలను తాము పరిష్కరిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో హస్తం పార్టీలో ఉండేందుకు ఆయన అంగీకరించినప్పటికీ ఎందుకో నమ్మకం కుదరకనే అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని తెలుస్తోంది.కాంగ్రెస్ నేతల్లో కూడా కొందరు సహాయ నిరాకరణగా ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులపై పలువురు మీడియా ప్రతినిధులు, సన్నిహితుల వద్ద ఘాటు వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు, ఇతర ప్రధాన సమస్యలకు సంబంధిత శాఖల మంత్రులకు, వారి ఓఎస్డీలకు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఎమ్మెల్యే వాపోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర నేతలెవ్వరూ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరని ఆయన తన ఫ్రస్ట్రేషన్ ను వెళ్లగక్కుతున్నారు. నియోజకవర్గంలో తనకు అనుకూలమైన అధికారులను రప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో ఇక అధికారికంగా కాంగ్రెస్ లో ఉండి ప్రయోజనం ఏమిటని ఆయన వాపోతున్నారు…
కృష్ణమోహన్ చాలా తెలివిగానే వ్యవహరిస్తున్నారనుకోవాలి. తన పనులు జరిగేందుకు కాంగ్రెస్ అధిష్టానంతో బేరాలు పెట్టే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలి. పైగా బీఆర్ఎస్ లో కూడా ఆప్షన్ ఉండటంతో ఆయన భయపడటం లేదు. కాంగ్రెస్ రాజకీయాలను తట్టుకుని నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఏం అవుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…