వైసీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి పనుల కోసం ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. వారిని కొనసాగిస్తారా లేదా అన్న మాట కూడా చెప్పకుండా రెండున్నర లక్షల మందిని త్రిశంకు స్వర్గంలో ఉంచేశారు. పైగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఐదు వేలు కాదు కనిష్టంగా పదివేలు వేతనం ఇస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు అసలుకే ఫిట్టింగ్ పెట్టారని వాలంటీర్లు వాపోతున్నారు. వైసీపీ పెద్దలను నమ్మి ఎన్నికలప్పుడు రాజీనామా చేసిన దాదాపు లక్షమంది వాలంటీర్లు ఇప్పుడు న ఘర్ కా.. నా ఘాట్ కా అన్నట్లుగా వేదన చెందుతున్నారు…
వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుందన్న ఆరోపణలున్నాయి. కేవలం సేవకులు అంటూ వారికి సేవా రత్న పేరుతో ఏటా నగదు బహుమతులు బిరుదులు ఇచ్చారు కానీ ఆ వ్యవస్థకు ఒక అర్థం చెప్పలేకపోయారు. ప్రైవేటు ఆర్మీ కాదు, ప్రభుత్వ వ్యవస్థ అని వాదించినా వాలంటీర్ సిస్టమ్ కు చట్టబద్ధత కల్పించలేకపోయారు. కూటమి వస్తే వాలంటీర్లను తొలగిస్తారన్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. వారి వేతనం రెట్టింపు చేస్తామని, వాలంటీర్ల సేవలను విస్తృత పరుస్తామని చంద్రబాబు చెప్పి మరీ ఓట్లు వేయించుకుని ఇప్పుడు చేతులెత్తేశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవన్నది నిజం. అయితే కనీసం అమలులో ఉన్న వేతనం కూడా ఇవ్వకపోతే రెండున్నర లక్షల కుటుంబాలు ఎలా బతుకుతాయన్నది మౌలికమైన ప్రశ్న అవుతుంది…
వాలంటీర్లకు అన్యాయం చేయమని ప్రభుత్వం చెబుతోంది కానీ వారిని పూర్వం పద్ధతిలో కొనసాగించాలని ప్రభుత్వానికి ఉద్దేశం లేదని తేలిపోయింది. పైగా పది వేల రూపాయలు వంతున నెలకు చెల్లిస్తూ రెండున్నర లక్షల మందిని పోషించడం అంటే ఏడాదికి వేల కోట్లు ఖర్చు అని కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకీ వాలంటీర్లు చేసే పౌర సేవలు ప్రత్యేకంగా ఏమి ఉన్నాయో అవి సచివాలయ సిబ్బందితో కూడా చేయించుకోవచ్చు. రెండు నెలల పాటు ఇంటింటికి వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన తీరుతో వాలంటీర్లు అవసరం లేదని తేలిపోయినట్లు టీడీపీలో ఒక వర్గం అంటోంది. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర అయితే వాలంటీర్ల సేవలను తాము సక్రమంగా ఉపయోగించుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలా కాకుండా వారికి సరైన ఉపాధి శిక్షణ ఇప్పిస్తామని అంటున్నారు. వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని ఆ విధంగా వారికి జీవితంలో సక్రమంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. వాలంటీర్లకు ఇక ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోవచ్చు. నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రైవేటు ఉద్యోగాలు వెదుక్కోమని చెప్పేస్తారు. దానికి కూడా ఎంత సమయం పడుతుందో, నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో చెప్పడం లేదు. శిక్షణా సమయంలోనైనా కొంత ఉపకారవేతనం వస్తుందని వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం మాత్రం నాన్చుడు ధోరణినే అమలు చేస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…