అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగీ రాజీవ్ అరెస్టు వ్యూహాత్మకంగా, ఒక పథకం ప్రకారమే జరిగిందనుకోవాలి. ఈ క్రమంలో సర్వేయర్ రమేశ్ అరెస్టుతో వైసీపీ హయాంలో అంటకాగిన అధికారులకు హెచ్చరిక చేసినట్లు కూడా అయ్యింది. జోగి రమేష్ ఇంట్లో జరిగిన సోదాల్లో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన తమ్ముడు కూడా కీలక పాత్ర వహించాడని తెలియడంతో ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం బుక్కయ్యిందని తేలిపోయింది. ఈ దిశగా జోగి రమేష్ కే కాకుండా వైసీపీలో పెద్ద తలకాయలకు త్వరలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి మీద కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే అవి ఎప్పుడు? ఎలా? మొదలవుతాయనే విషయంలోనే సందేహాలు ఉంటూ వచ్చాయి.చంద్రబాబు నాయుడు సర్కారు తొలుత శ్వేతపత్రాల రూపంలో గత ప్రభుత్వం తప్పిదాలను ప్రజల ముందుంచారు.ముందు ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే.. న్యాయపరంగా కూడా ఎలాగూ తప్పించుకోలేని విధంగా దిగ్బంధనం చేసిన తర్వాత మాత్రమే అరెస్టుల జోలికి వెళుతున్నారని జోగి రమేష్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ముందు జగన్ ను టార్గెట్ చేస్తారని అనుకున్న వాళ్లు తప్పులో కాలేసినట్లే అనుకోవాలి. చుట్టు ఉన్న వారిని అరెస్టు చేసి దిగ్బంధనం విధించిన తర్వాత జగన్ ను టార్గెట్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుడు జగన్ పై పెట్టే కేసుల సంఖ్యను కూడా పెంచేసి బెయిల్ రాకుండా చేసేందుకు వీలుంటుంది. కేసుల వివరాలు కూలంకషంగా జనంలోకి వెళితే అప్పుడు జగన్ పట్ల సింపథీ కూడా రాదని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే జగన్ పాలన పట్ల జనంలో వ్యతిరేకత ఉన్నందున అవినీతిని నిరూపించగలిగితే సాక్ష్యాధారాలను జనంలో ఉంచగలిగితే అప్పుడు నిరసన స్వరాలు వినిపించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు..
జోగి రమేష్ విషయంలో ఇప్పటికే వ్యతిరేకతా భావం మొదలైంది. కుటుంబ సభ్యుల పేర్లు అడ్డుపెట్టుకుని నేతలు చేసిన దందాలు రమేష్ కేసుతోనే బయటపడుతున్నాయి. తప్పు చేయని అమాయకుడిని అరెస్టు చేశారని, అభం శుభం తెలియనివాడిని జైలుకు పంపాలని చూస్తున్నారంటూ జోగి రమేష్ పెడబొబ్బలు విని జనం నవ్వుకోవడమే కాకుండా, సీరియస్ గా కూడా స్పందిస్తున్నారు. ‘ఈ కుమారుడిని నాశనం చేసింది ఆ తండ్రే’ అని వ్యాఖ్యానిస్తున్నారు. అభం శుభం తెలియని రాజీవ్ పేరుతో భూమి కొనుగోలు చేసిందెవరు.? అది పక్కాగా వివాదాస్పద భూమి అని తెలిసినా అధికారులపై వత్తిడి తెచ్చి సర్వే నెంబరు మార్పించిందెవరు? భవిష్యత్‌లో తేడా వస్తే బలయ్యేది తన కుమారుడేననన్న ఆలోచన లేకుండా అధికారం ఉందని నాడు అడ్డదారిలో వెళ్లిందెవరు? అని జనం ప్రశ్నిస్తుంటే జోగి రమేష్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. పైగా మొత్తం వ్యవహారంలో జోగి రమేష్ పాత్రపై సీఐడీ విచారణ జరుగుతోంది. లింకు దొరికేంత వరకే ఆయన సేఫ్. ఒక్క చిన్న లింకు తగిలినా ఇక జైల్లోనే సెటిలైపోవాల్సిందే. సర్వే నెంబర్లు మార్చడం వెనుక జగన్ ఆయన తాడేపల్లి పరివారం హస్తం ఉందా అనే కోణంలో గుట్టు చప్పుడు కాకుండా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేశ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బూతులతో విరుచుకుపడేవారు. అప్పటి సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఓ సభలో జోగి రమేశ్.. చంద్రబాబును ముసలి నక్క అని, పవన్ కల్యాణ్‌ను పిచ్చి కుక్క అంటూ అసభ్యంగా దూషించారు. జోగి ప్రసంగం తర్వాత జగన్ ఆయనను పిలిచి మరీ భుజం తట్టారు. అసెంబ్లీలోనూ అదే తంతు! అప్పుడూ జగన్ స్పందిస్తూ.. జోగి అన్నకు థ్యాంక్యూ అంటూ అభినందించేవారు. ఆ మాటలన్నింటినీ గుర్తుపెట్టుకున్న టీడీపీ నేతలు….ఇప్పుడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత తమదైన కార్యాచరణను ప్రారంభించారని పార్టీ వైపు నుంచి వినిపిస్తున్న మాట. అప్పట్లో విర్రవీగి తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన వారెవ్వరినీ వదిలేది లేదని అంటున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు, పట్టాభిని లాక్కెళ్లిన తీరు, చంద్రబాబును జైలుకు పంపిన విధానం లాంటివి అన్నీ గుర్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతీ పనికి వైసీపీ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. అంటే పిక్చర్ అభీ బాకీ హై అని హిందీ సామెత చెప్పుకోవాల్సిందేనేమో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…