వలంటీర్ల డిమాండ్లలో చంద్రబాబు కొత్త ట్విస్ట్

By KTV Telugu On 28 August, 2024
image

KTV TELUGU :-

వలంటీర్ల సమస్య పరిష్కారమవుతుందా.. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటారా. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి… సంతోషించాలా.. బాధపడాలా అర్థం కాని డైలమాలో వలంటీర్లు ఎందుకున్నారు. రాజీనామా చేసిన వలంటీర్లు చెంపలేసుకునే పరిస్తితి ఎందుకొచ్చింది..

ఆంధ్రప్రదేశ్లో వలంటీర్ల పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలా  ఉంది.  ఉద్యోగం ఉందో,ఊడిందో వాళ్లకు అర్థం కావడం లేదు. వలంటీర్లను వదులుకునేది లేదని చంద్రబాబు ఇచ్చిన క్లారిటీని విశ్వసించాలా వద్దా అన్న టెన్షన్ వలంటీర్లలో పెరిగిపోతోంది. వేతన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని సర్కారు చేసిన ప్రకటనపై వారికి నమ్మకం కుదరడం లేదు.

నిజానికి ఎన్నికల ముందు టీడీపీ చెప్పిందొక్కటీ. ఎన్నికల తర్వాత చేసిందొక్కటీ. వలంటీర్లను కొనసాగిస్తామని వారి గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పది వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దానితో చంద్రబాబు మాటలను విశ్వసించిన వలంటీర్లు టీడీపీకి ఓటేశారని ఒక వాదన ప్రచారంలో ఉంది. కట్ చేసి చూస్తే ఎన్నికల్లో కూటమి గెలిచి రెండు నెలలైనా వలంటీర్లను పట్టించుకోలేదు. పెన్షన్ల పంపిణీ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులతో చేయించారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పైసా గౌరవ వేతనం ఇవ్వలేదు. దానితో తమ ఖేల్ ఖతమైందని వలంటీర్లు భయపడుతున్నారు.

ఇంతలోనే ప్రభుత్వం తరపున ఒక ప్రకటన వచ్చింది. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని.. వారికి ఇస్తామ‌న్న 10 వేలను కూడా  చెల్లిస్తామ‌ని తెలిపింది. వ‌లంటీర్ల‌లో నైపుణ్యాల‌ను పెంచి మ‌రో రూపంలో వారి సేవ‌లు వినియోగించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలిపింది. కొన్ని సాంకేతిక కారణాలతో వలంటీర్లకు గౌరవ వేతనం ఇవ్వలేకపోయామని, హామీ ఇచ్చిన విధంగా వారికి బకాయిలతో కూడిన వేతనం చెల్లిస్తామని ప్రకటించింది. పక్షం రోజుల్లో వలంటీర్ల గౌరవ వేతనం చెల్లించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనితో వలంటీర్ల సమస్య పరిష్కారమైనట్లేనని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అక్కడే మరో సమస్య ఎదురవుతోంది. వైసీపీని నమ్ముకుని ఎన్నికల ముందు రాజీనామా చేసిన లక్షమంది వలంటీర్లను మళ్లీ పనిలోకి తీసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కుల మాట‌లు విని పొర‌పాటు చేశామ‌ని.. మంత్రుల‌కు, అధికారుల‌కు, క‌లెక్ట‌ర్ల‌కు వాళ్లు విన్నవించుకున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. మరి వారి కోరికను ప్రభుత్వం మన్నిస్తుందో లేదో చూడాలి…

రెండు నెలలు నిరీక్షించి విసిగిపోయిన వలంటీర్లు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు.  ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో వారికి  వామపక్ష పార్టీలు కూడా మద్దతిచ్చాయి. దానితో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని అంటున్నారు. వారిని ఉద్యమించనిస్తే పరిస్తితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గ్రహించింది. వైసీపీ హయాంలో ప్రభుత్వోద్యోగులు నిర్వహించిన ఉద్యమాలు టీడీపికి బాగానే గుర్తున్నాయి. అవి రూటు మారితే జరిగే నష్టం చంద్రబాబుకు తెలుసు. అందుకే అసంతృప్తి బయట పడకుండా ఉండాలంటే ఏదోక హామీ ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకుని వారిని బుజ్జగిస్తోంది. వాస్తవానికి వలంటీర్లు అందరినీ ఉద్యోగంలోకి తీసుకోవాలన్న కోరిక చంద్రబాబు ప్రభుత్వానికి లేదని అంటున్నారు. ఎంపిక చేసిన కొందరు వలంటీర్లకు పునరావాసం కల్పించి.. మిగతా వారిని అలా వదిలెయ్యాలని భావించింది. ఇప్పుడు మాత్రం వలంటీర్లు ఉద్యమ బాటకు దగ్గరవుతున్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరచాల్సిన అనివార్యత ఏర్పడింది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి