హైదరాబాద్ మహానగరంలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న వేళ బీజేపీ ఇప్పుడు కొత్త నినాదాన్ని అందుకుంది. 40 రోజుల్లో 43 ఎకరాల చెరువు భూములకు విముక్తి లభించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్న వేళ….కూల్చివేతలపై సమగ్ర చర్చ జరగాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు, బ్యాంకు లోన్లతో అమాయకంగా కొనుగోలు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలను కాపాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. పెద్దలను కొట్టు, పేదలను వదులు అన్న నినాదంతో బీజేపీ ఉద్యమ బాట పడుతుండగా.. మీడియా కూడా వారికి మద్దతిస్తోంది. బడా బాబుల అక్రమ కట్టాడాలు కూల్చితే ఓకే.. కానీ పేదల జోలికి వస్తే ఊరుకోబోమంటున్న బీజేపీ నేతలు ఈ దిశగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పేద, మధ్యతరగతి వారి ఆస్తుల కూల్చివేతపై పోరాటానికి సిద్ధం అవుతోన్న బీజేపీ.. సామాన్యుల ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెగేసి చెబుతోంది. చెరువు భూములు, నిషేధిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయడం, మీడియా అందుకు వత్తాసు పలకడంతో ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచనలో పడాల్సిన అనివార్యత ఏర్పడింది. ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తే ఊరుకునేది లేదని బీజేపీ హెచ్చరిస్తోంది…
నిజానికి హైడ్రా ఏర్పాటై కూల్చివేతలు ప్రారంభమైన తర్వాత ఏది సీలింగ్ ల్యాండ్? ఏది ప్రభుత్వ భూమి? ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలేమిటి?.. లాంటి భయంతో కూడిన ప్రశ్నలు సామాన్యుల్లో మెదులుతున్నాయి. 15 నుంచి 20 సంవత్సరాల ముందట.. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతుల ఆధారంగా హౌసింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసిన వాళ్లు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఏదోక ఉల్లంఘన పేరుతో హైడ్రా అధికారులు తమ భవనాలను కూల్చివేస్తారన్న భయం సామాన్యులను వెంటాడుతోంది.ఉల్లంఘనల సంగతి తెలియక… 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోను తీసుకుని ఇల్లు కొనుక్కుని కిస్తీలు కడుతూ ఉన్న వారు ఇప్పుడు సర్వం కోల్పోయి బజారున పడాల్సి వస్తే వారి గతేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా కూడా ప్రభుత్వాన్ని అదే ప్రశ్నిస్తోంది. అదీ వనస్థలీపురం చెరువు అయినా, సరూర్ నగర్ లేక్ అయినా, ఇంకోకటి ఇంకోకటి అయినా సరే… లే అవుట్లు వేసేప్పుడే ఎందుకు ఆపలేదన్నది ప్రధాన ప్రశ్న.రామాంతపూర్, మల్కాజ్‌గిరి, అత్తాపూర్, శేర్‌లింగంపల్లి.. ఇలా భాగ్యనగరంలో అనేక చోట్ల వందల చెరువులు కబ్జాకు గురై కనుమరుగయ్యాయి. వాటికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అడ్డగోలుగా ఎన్‌వోసీలు ఇచ్చారు. ఇల్లు కట్టుకుని రెండు దశాబ్దాలు దాటిపోయి.. ఇప్పుడు రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న వారు రోడ్డున పడటమంటే ఆత్మహత్యా సదృశ్యం కాదా అన్నది హైదరాబాద్లో ప్రతీ ఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్న…
పలువురు బిల్డర్లు తప్పుడు మార్గాల్లో, లంచాలు మేపి.. కావాల్సిన అనుమతులు పొంది భవనాలు కట్టి, అమ్మకాలు సాగించారు. ఇలాంటివి వెయ్యికి పైగా భారీ అపార్టమెంట్లే ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, రెరా ఇస్తున్న అనుమతులకు విలువ ఉందా? లేదా? అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులే అడ్డదారులు తొక్కితే కొనుగోలుదారులు ఇక ఎవరిని నమ్మాలి? కూలిపోయిన ఇళ్లకు బ్యాంక్ లోను బకాయిలు కట్టాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్నగా కొనసాగుతోంది. ఏదేమైనా అనుమతులు ఇచ్చిన అధికారులెవ్వరో పట్టుకుని వారిని శిక్షించాలే తప్ప.. నమ్మి మోసపోయి వాటిని కొనుక్కున్న సామాన్యులను బలి చేయకూడదన్న డిమాండ్ వినిపిస్తోంది. అదే అంశం ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైన మీడియా కూడా ప్రశ్నిస్తోంది. విపక్షాల పోరాటానికి మీడియా మద్దతిస్తోంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…