అధికారానికి వచ్చి మూడు నెలలు గడవకముందే టీడీపీ నేతలు చేతివాటం చూపిస్తున్నారు. ఐదేళ్లు విపక్షంలో ఉండి ధనదాహంతో గొంతెండిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు కలెక్షన్ల కోసం బెదిరింపులకు సైతం దిగుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీలకు కొటేషన్లు పెట్టేసి అడిగిందీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో గొడవలు, దాడులు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో హైవే కాంట్రాక్టర్లు బలైపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
టీడీపీ నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇసుక దందాను ప్రారంభించారు. అక్కడక్కడా ఇసుక తరలించి స్టాక్ పెట్టేసుకున్నారు. ఎక్కువ సొమ్ము ఇచ్చిన వారికి ఇసుక విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇసుక రేటు అమాంతం పెరిగిపోయింది. ఇళ్లు కట్టుకునే వాళ్లు నానా తంటాలు పడుతున్నారు. పనులు సగంలో ఆపలేక అడిగిన సొమ్ము ఇచ్చి ఇసుక లోడింగ్ చేసుకుంటున్నారు.
కొంచెం వెసులుబాటు తీసుకుని టీడీపీ నేతలు ఇప్పుడు హైవే కాంట్రాక్టర్లపై పడ్డారు.రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఒక తతంగం అధికార వర్గాల్లో చర్చకు కారణమైంది. కడప జిల్లాకు చెందిన ఇద్దరుముగ్గురు ఎమ్మెల్యేలు, హైవే కాంట్రాక్టర్ల దగ్గర పది నుంచి ఇరవై కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఖర్చుపెట్టామని అంత మార్జిన తమకు కూడా రావడం లేదని కాంట్రాక్టర్ వాపోయినా వాళ్లు వినేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేసి రాష్ట్రప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించగలిగితే ఎమ్మెల్యేలు అడిగిందీ ఇస్తామని కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు. అయితే కాస్ట్ ఎస్కలేషన్ కు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. ఐనా ఎమ్మెల్యేలు మాత్రం ఊరుకోవడం లేదు. ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయించేందుకు సిద్ధమవుతున్నారు. దానితో సదరు హైవే కాంట్రాక్టు కంపెనీ తాను చేస్తున్న పనులను ఆపేసి చోద్యం చూస్తోందని చెబుతున్నారు. ఐనా వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యేలు డిసైడయ్యారట. బడా పారిశ్రామికవెత్తలు, ఏపీలో పెట్టుబడులు పెట్టి ఇప్పటికే సెటిలైన వారిని కూడా డబ్బుల కోసం వేధిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
టీడీపీ నేతలు ఇప్పటికే భూదందాలు మొదలు పెట్టేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే గళ్లా మాధవి కుటుంబ సభ్యుల వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రైతు పొలాన్ని గళ్లా కుటుంబం కారు చౌకగా కొట్టెయ్యాలని ప్రయత్నించింది. మీడియాలో వార్తలు రావడం, చంద్రబాబు సీరియస్ కావడంతో మౌనంగా ఉండిపోయారు. పిలుపు వచ్చిందే తడవుగా పోలీసులంతా ఎమ్మెల్యేల ఇంటికి పరుగులు తీసి చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు. ఎవరిని బెదిరించాలంటే వాళ్లను పిలిపించి మాట్లాడేస్తున్నారు. వాళ్లు అడిగిందీ ఇవ్వకపోతే జరిగే పరిణామాలకు పోలీసులు బాధ్యత వహించబోరని హెచ్చరిస్తున్నారు. దానితో వ్యాపారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…