భారీ వర్షాలు ఒక నగర స్వరూపాన్నే మార్చేశాయి.ఎండలకు, వేడికి పర్యాయపరంగా బెజవాడను ఒకప్పుడు బ్లేజువాడగా పిలిచే వారు. కేవలం రెండు రోజుల వర్షాలకు అదే విజయవాడ ఇప్పుడు వరద వాడగా మారింది. ఏపీ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న అతిపెద్ద నగరం విజయవాడ ఇప్పుడు ఎందుకూ కొరగాని ప్రాంతంగా మారిపోయింది. ఇటు కృష్ణా నది, అటు బంగాళాఖాతం రెండు వైపులా నగరంలోకి ఎంట్రీ ఇచ్చాయన్న రేంజ్ లో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలుగా మారిపోతే అందులో విజయవాడది అత్యంత దీన స్థితి. వెళితే విజయవాడ వెళ్లాలనుకునే వారు ఇప్పుడు పది అడుగులు వెనక్కి వేస్తున్నారు. సిటీకి ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఒక చోట కొండ చరియలు విరిగిపడి నలుగురు చనిపోయిన ఘటన వయనాడ్ ను తలపించింది. నగరాన్ని ముంచేసిన కృష్ణమ్మ దెబ్బకు నగరమేదో, నది ఏదో అర్థం కావడం లేదు. జనం సురక్షిత ప్రదేశాలకు చేరుకునే లోపే ఇళ్లన్నీ మునిగిపోయాయి. వరద ప్రవాహానికి కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నగరం విలవిల్లాడింది. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్లో పలు కాలనీలు, శివారు ప్రాంతాలు ఒకటేంటి.. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వరద పోటెత్తింది. నిర్మల కాన్వెంట్, పాలీక్లినిక్ రహదారి, అయిదో నంబరు మార్గం, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని దారులే కాదు.. జాతీయ రహదారులూ నీటిలో చిక్కుకుపోయాయి. వర్షాలు ఆగిపోయి వరద నీరు తగ్గిన తర్వాత అంచనా వేసుకుంటే ఎన్ని వందల కోట్లు నష్టం ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. వ్యాపారాలు ఎంత నష్టం వాటిల్లిందో ఆలోచిస్తేనే వణుకు పడుతుంది. 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెజవాడ ఇప్పుడు నీటిలో మునిగి ఉంది. ఏకధాటిగా 35 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడిన మన నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో విజయవాడను చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పుడు ప్రభుత్వమూ, అధికారులు చేస్తున్న విన్నపం ఒక్కటే. దయచేసి ఎవ్వరూ ఇప్పుడే విజయవాడ రాకండీ అని బతిమాలుతున్నారు. నగరాన్ని కాస్త ఊపిరి తీసుకోనివ్వండని వేడుకుంటున్నారు.
నిజానికి ప్రస్తుత విజయవాడ దుస్తితికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని చెప్పుకోవాలి.టౌన్ ప్లానింగ్ పై దృష్టి పెట్టకపోవడం, దశాబ్దాలుగా దిద్దుబాటు చర్యలు లేకపోవడమే ఇప్పుడు గగ్గోలు పెట్టడానికి కారణమవుతోంది. నగరానికి వరదనీటి మళ్లింపు వ్యవస్థ లేకపోవడం పెనువిపత్తుకు ప్రధాన కారణంగా మారింది. పదేళ్ల క్రితమే వరద నీటి కాలువల నిర్మాణానికి కేంద్రం 400 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటిని సరిగ్గా వినియోగించుకుని పరిస్థితిని చక్కబెట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. అందులో మూడో వంతు కూడా వ్యయం చేయలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ తరచూ వైజాగ్ వెళ్లిపోతానని చెబుతూ విజయవాడను పూర్తిగా ముంచేశారు. విజయవాడలో అభివృద్ధి పనులను పూర్తిగా వదిలేశారు. పాలకుల నిర్లక్ష్యానికి బెజవాడ మౌనంగా రోధిస్తోంది. ఏమీ చేయలేక కక్కలేక,మింగలేక నగర జనం కంటతడి పెడుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…