ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఏపీ వ్యాప్తంగా కురిసిన భారీవర్షాలు ఒక ఎత్తు అయితే.. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి.. నగరం పెద్ద నదిలా మారిపోవటం మరో ఎత్తు అని ఆయనకు తెలియదా. లక్షలాది మంది జనం వరద తాకిడికి నిరాశ్రయులైతే పవన్ ఏం చేస్తున్నారు. అసలు ఆయనకు జనం బాధలు పట్టవా. రోజూ మీటింగులు పెట్టి సూక్తులు చెప్పే పవర్ స్టార్ .. ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు. 70 ఏళ్లు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలుగా వరద నీటిలో తిరుగుతూ జనానికి ధైర్యం చెబుతుంటే పవన్ మాత్రం ఇంటికే పరిమితం కావడంపై ఏపీ జనంలోనూ తెలుగు ప్రజల్లోనూ అనుమానం, అసహనం వ్యక్తమవుతోంది. కొన్ని వేల కుటుంబాల వారు వరదలో చిక్కుకుపోయిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం తపించిన పరిస్థితి ఆయనకు అర్థమవుతుందా లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు…
చంద్రబాబు బోట్లలో తిరుగుతున్నప్పుడు సీఎం వెంట పవర్ స్టార్ ఉండొద్దా అన్నది పెద్ద ప్రశ్న. కాసేపు చంద్రబాబు వెంట తిరిగిన తర్వాత తాను విడిగా మరో ప్రదేశానికి వెళ్లి జనానికి ధైర్యం చెప్పాలా వద్దా అని జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ కేవలం సొంత పబ్లిసిటీకి, చేతికి మట్టి అంటకుండా చేసే పనులకే పరిమితమవుతున్నారన్న ఆగ్రహం జనంలో పెరిగిపోతోంది. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలో ఉప ముఖ్యమంత్రిగా దిశానిర్దేశం చేసే బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు పవన్ కూడా తన వంతుగా జనంలో ఉండాలా వద్దా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. పోనీ తాను రాలేకపోవడానికి కారణం ఏమిటో చెప్పారా అంటే అదీ లేదు. అర్థరాత్రి దాటిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.
ఇలాంటి వేళ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ కనిపించకపోవటం.. ఆయన ఉనికి ఎక్కడన్న ప్రశ్న తలెత్తింది.
ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, జిల్లా పరిషత్తుల్లో అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. – మండల స్థాయి, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తక్షణ స్పందనకు బృందాలు సిద్ధంగా ఉంచారు. ప్రతి 6 గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్సుల ద్వారా అన్ని జిల్లాల బృందాలతో పర్యవేక్షణ, సమన్వయం చేసుకోవడం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇలా సాగిందీ ఆయన ప్రకటన.
అసలు ప్రకటనల అవసరమేమిటి. ఫిజికల్ గా ఆయన కనిపించాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న ప్రతీ ఒక్కరికీ రావడం సహజం. మరి పవన్ కు మాత్రం ఎందుకు అర్థం కాలేదు.. అంటే లోగుట్టు పెరుమాళ్కే ఎరుక అని చెప్పాల్సిందే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…