మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్నారా. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కష్టకాలం తప్పదా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ లో నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయా. రేవంత్ రెడ్డి తీరుపై కొందరు నేతలు ఆగ్రహం చెందుతున్నారా.. తెరచాటు ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయా.. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఇష్టానుసారం మాట్లాడే నాయకుడిగా కనిపిస్తారు. ఎప్పుడేమి మాట్లాడతారో అర్థం కాని నేతగా చెలామణి అవుతారు.అనుకున్నది సాధించే వరకు ప్రేలాపనలకు దిగుతారని జనంలో అపవాదును కూడా ఆయన మూటగట్టుకున్నారు. ఐనా సరే ఒక్కో సారి ఆయన చెప్పిందాంట్లో ఎంతో కొంత రీజన్ ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. బీజేపీలోకి వెళ్లి మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చావంటే ఆ పార్టీ గెలుస్తుందని తెలుసు కాబట్టి వచ్చానని రాజగోపాల్ ప్రకటించడం, ఆ మాటే నిజం కావడం వెనువెంటనే జరిగిపోయాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరో మాట అనేశారు. జల వనరుల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా సంబోధించిన ఆయన తర్వాత కూడా దాన్ని తప్పుగా గుర్తించలేదు. పైగా త్వరలో ఉత్తమ్ సీఎం అవుతారని తెలుసు కాబట్టే అలా చెప్పానని సమర్థించుకున్నారు. తన నాలుక మీద మచ్చ ఉందని, ఒక్క సారి చెప్పానంటే జరిగి తీరుతుందని రాజగోపాల్ ధీమాగా ప్రకటించేశారు. నిజానికి రాజగోపాల్ రెడ్డి మాటలను తేలిగ్గా తీసిపారేయ్యడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న స్థితిగతులు, సీఎం పదవికి పోటీదారులను లెక్కగట్టిన తర్వాతే రాజగోపాల్ ఓ స్కడ్ వదిలారనుకోవాలి…
ఔట్ సైడర్ రేవంత్ రెడ్డి సీఎం కావడం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లకు ఇష్టం లేదు. అధిష్టానం మాట కాదనలేక రేవంత్ నాయకత్వానికి వాళ్లు జై కొట్టారు. హానీమూన్ పీరియడ్లో వాళ్లు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అంతర్లీనంగా అసమ్మతి రాజకీయాలు చేస్తున్నారని రాజగోపాల్ మాటలను బట్టే అర్థమవుతోంది. అసలు ఖేల్ ఇప్పుడే మొదలైందని కూడా అనుకోవాల్సి వస్తోంది.
రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తొట్టతొలిసారిగా ప్రశ్నించినదీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డేనని చెప్పాలి. ఒక సారి ఢిల్లీలో మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని ఆయన విమర్శించారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఎన్నికల ముందు భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు లాంటి వాళ్లు సీఎం పదవిని ఆశించారు. సమర్థంగా ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించే సత్తా తమకు ఉందని అధిష్టానం దగ్గర కొందరు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవిపై చర్చ వచ్చినప్పుడు రేవంత్ అభ్యర్థిత్వాన్ని ఉత్తమ్, శ్రీధర్ బాబు గట్టిగా ప్రతిఘటించారు. చివరకు వారిని బుజ్జగించి, తర్వాత చూద్దామని చెప్పి అధిష్టానం రేవంత్ పేరును ఫైనలైజ్ చేసింది. పైగా రాహుల్ గాంధీ పూర్తి మద్దతు రేవంత్ కు ఉండటంతో ఎవరూ ఎదురుచెప్పలేకపోయారు. దళిత సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో సమీకరణాలు చూసుకుని అందరూ మౌనం వహించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన తర్వాత క్రమంగా నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తోంది. కొందరు మంత్రులను రేవంత్ రెడ్డి తన పక్కన పెట్టుకుని ఇతరులను విస్మరిస్తున్నారన్న అసంతృప్తి కూడా మొదలైందని అంటున్నారు. అందుకే ఎవరి పవర్ సెంటర్ వారిది అన్నట్లుగా రాజకీయాలు జరుగుతున్నాయి. నిదానంగా గ్రూపులు కట్టే కాంగ్రెస్ కల్చర్ కు తెరతీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాలుగు గ్రూపులు ఉంటేనే అది కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఈ క్రమంలో ఉత్తమ్ గ్రూపు బలపడే ప్రయత్నంలో ఉంది. పైగా జిల్లా లెక్కలు కూడా కలిసి వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ ది ఉమ్మడి నల్లగొండ జిల్లా అయితే, రేవంత్ ది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవుతుంది. దానితో అస్మదీయులను దగ్గరకు చేర్చుకునే ప్రక్రియకు ఉత్తమ్ తెరతీశారనే చెప్పాలి.
ఏదిఏమైనా పదహారణాల కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడే బయటపడుతోంది.తనకు ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఒక గ్రూపు రాజకీయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా. అసమ్మతిని మొక్కలోనే తుంచేస్తుందా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది…
https://youtu.be/7685yaChf7g
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…