సజ్జలపై వేసీపీ గరం గరం…

By KTV Telugu On 3 September, 2024
image

KTV TELUGU :-

వైసీపీ సమస్యలన్నింటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే కారణమా. ఆయన అందరినీ అణిచివేసి పెత్తనం చేలాయించినందున పార్టీ శ్రేణులు జగన్ వరకూ చేరలేకపోయామని ఇప్పుడు వైసీపీ జనం కారాలు మిరియాలు నూరుతున్నారు. పైగా ముంబై హీరోయిన్ వ్యవహారంలో తప్పంతా సజ్జలవైపే చూపిస్తున్న తరుణంలో పార్టీ ఆయన్ను  పక్కన పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి…

కాదంబరీ జెత్వానీ వ్యవహారం వైసీపీ నేతలకు మెడకు గట్టిగానే బిగుసుకునే అవకాశం ఉంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులే అంతా చేశారన్న అనుమానంతో విచారణ జరుగుతుండగా.. అసలు సూత్రధారులు ఎవరన్న చర్చ తారా స్థాయికి చేరుకుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి ఆదేశాల మేరకే పోలీసులు ముంబై వెళ్లి కాదంబరీని లాక్కొచ్చారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కొన్ని మీడియా సంస్థలు సజ్జల పేరును కూడా ప్రస్తావించారు. దానితో సజ్జల ఫైరైపోయారు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో మీడియా ఇప్పుడు ఆయన పేరును చెప్పడం మానేసింది. కాదంబరీ వ్యవహారం మొత్తం ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతోంది. అయితే ఒక ప్రైవేటు వ్యవహారం తమకు చుట్టుకుంటోందని, కూటమి ప్రభుత్వం తమను గట్టిగా బిగించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ శ్రేణులకు అర్థమైపోయింది. ఎవరికీ సంబంధం లేని వివాదం పార్టీ  మీదకు రావడం వారికి సుతారమూ నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే కాదంబరీ వ్యవహారంలో సజ్జలకు సంబంధం ఉన్నా లేకపోయినా..ఐదేళ్ల పాటు ఆయన పెత్తనం వల్ల పార్టీ దెబ్బతిన్నదన్న ఫీలింగ్ మాత్రం పోవడం లేదు.  ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌భుత్వంలోనూ స‌జ్జ‌ల కీ రోల్ పోషించారు. అంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవ‌రు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. స‌జ్జ‌ల  చెప్పాల్సిందే. జగన్ అప్పాయింట్ మెంట్ కావాలంటే సజ్జలను అడగాల్సిందే. సజ్జలకు ఇష్టమైన వాళ్లే జగన్ కు కలిసే వీలుంటుంది. లేని పక్షంలో నిరీక్షణే తప్ప దర్శనభాగ్యం ఉండేది కాదు.. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలు, వివాదాలు చోటు చేసుకున్న‌ప్పుడు కూడా.. పంచాయ‌తీలు చేసింది స‌జ్జ‌లే. జగన్ కు భయపడినా భయపడకపోయినా సజ్జలకు భయపడాల్సి వచ్చేది. సజ్జల వల్లే అనేక చోట్ల పార్టీ ఓడిపోయిందని కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 85 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు ఆయనే కారణమని  చెబుతున్నారు. గుంటూరు వెస్ట్‌లో మ‌ద్దాలి గిరిని త‌ప్పించ‌డం వెనుక‌.. స‌జ్జ‌ల కీల‌క పాత్ర పోషించారని అంటారు. దీంతో గిరి ఎన్నిక‌ల స‌మ‌యంలో పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయి.. క‌నీసం పార్టీ త‌ర‌ఫున కూడా ప్ర‌చారం చేయ‌లేదు. ఇలా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో జ‌రిగింది. అలానే.. నెల్లూరులోనూ కీల‌క నేత‌లు దూరం కావ‌డానికి కూడా ఆయ‌నే కార‌ణమ‌ని చెబుతున్నారు.

పార్టీలో అంతర్గీనంగా ఇప్పుడో చర్చ జరుగుతోంది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి సజ్జలను తప్పించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే పార్టీలో మార్పులకు అవకాశం ఉందని, నిజమైన కార్యకర్తలకు గౌరవం లభిస్తుందన్న నమ్మకం  కలుగుతుందని వారు అంటున్నారు. సజ్జల పెట్టిన ఒకరిద్దరినీ తొలగిస్తే మరింత విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. జగన్ అందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి