ఒక ఏరు మహానగరాన్నే ముంచేసింది. ప్రజలకు, పాలకులకు దిక్కుతోచని పరిస్థితిని సృష్టించింది. ఒక పెద్ద సరసుకు మంచినీరు అందించాల్సిన బుడమేరు.. ఇప్పుడు బెజవాడ దుఖదాయినిగా మారింది. అందులో అకస్మాత్తుగా వచ్చిన వరద జలాలు, దాదాపు నాలుగు లక్షల మందిని నిరాశ్రయులను చేశాయి. అసలు బుడమేరు ఎందుకలా తయారైంది. కేటీవీ స్పెషల్….
కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నగరం నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది. కృష్ణా జలాలే నగరాన్ని ముంచెత్తాయేమోనన్నది చాలామందిలో నెలకొన్న భావన. అది వాస్తవం కాదని, నగర శివారుల్లోంచి ప్రవహించే బుడమేరు అనే ఓ మాదిరి డ్రెయిన్ కారణమన్నది తెలుసుకోవాల్సిన అంశం. పొలాల్లోంచి జాలువారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగు.. విజయవాడకు ఎందుకు దుఃఖదాయనిగా పరిణమించిందో ఆలోచిస్తే కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది..నిజానికి సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. అప్పట్లో చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో పర్యవసానంగా ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయి. రాజధాని అమరావతి పక్కనే ఉండటంతో పాటు 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బుడమేరు… ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఒకటిగా పేరు పొందింది.. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు అవుతుంది. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండే విజయవాడకు ఎక్కువ ముప్పు ఉందని తెలిసి కూడా తగిన చర్యలు తీసుకోవడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. బుడమేరు వర్షాకాల గరిష్ఠ ప్రవాహం 11 వేల క్యూసెక్కులుగా ఉంటుంది. 2005వ సంవత్సరంలో 70 వేల క్యూసెక్కులు ప్రవహించడంతో తొలిసారి బెజవాడ నీట మునిగింది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.అప్పట్లో చెలరేగిన ఆందోళనల మూలంగా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు.
బుడమేరు ప్రస్తుత సమస్యకు కారణం ఏమిటి. ఇప్పుడు ఎందుకు వరదలు వచ్చాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏమవుతుంది.. ఖమ్మం నుండి వెలగలేరు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్ మీదుగా బుడమేరు విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 1970వ దశకంలో నిర్మించారు.పొలవరం ప్రాజెక్టులో భాగంగా 2007 – 2008లో పోలవరం కుడికాల్వలోకి బుడమేరు ప్రవాహాన్ని మళ్లించారు. అయితే ఈ నీరు కృష్ణా నదిలో చేరాలంటే కృష్ణా ఎగువ నుండి వరద కొనసాగినప్పుడు అందులో ఈ జలాలు చేరే అవకాశం లేదు. బుడమేరును పోలవరం కుడికాల్వలో కలిపినా ఆ కాల్వ గరిష్ట ప్రవాహం 37,500 క్యూసెక్కులు కావడం, బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వలు ఏర్పాటు చేయక పోవడం గమనించాల్సిన అంశం. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా సమస్య తలెత్తింది. విటిపిఎస్ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు ఆ తర్వాత అటకెక్కాయి. బుడమేరు విజయవాడ పట్టణంలోకి రాకుండా నిర్మించిన కరకట్టను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు కొనసాగాయి. తెలంగాణ, ఆంధ్రా విడిపోవడంతో విజయవాడ నగరంలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ఈ 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాల మూలంగా కనీసం బుడమేరు కరకట్ట ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. దీంతో 20 సంవత్సరాల నిర్లక్ష్యానికి ఫలితంగా తాజా వరదల మూలంగా విజయవాడ మరోసారి నీట మునిగింది. ఇప్పుడు న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఖ మ్మం జిల్లాలో భారీ వర్షాలతో నాలుగు రోజుల క్రితం 60 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలుచోట్ల గండ్లు పడి, ఆ నీరంతా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. జక్కంపూడి, సింగ్‌నగర్, వాంబేకాలనీ, పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి.
విజయవాడ వరదలకు కృష్ణా నది కానీ, స్థానిక పరిస్థితులు కానీ కారణం కాదు. ఎక్కడో ఖమ్మం నుంచి ప్రవహించే బుడమేరు మాత్రమే అందుకు కారణమైంది.అందులోనూ బుడమేరు సమర్థత 11 వేల క్యూసెక్కులైతే.. ఏకంగా 60 వేల క్యూసెక్కులు వచ్చి చేరింది. దానితో జల వత్తిడిని తట్టుకోలేక నీరంతా ఆవాస ప్రాంతాలపై పడింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిదే..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…