వరదలు విషాదాన్ని మిగిల్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేశాయి. కొన్ని లక్షల మంది ఇప్పుడు అంతా కోల్పోయి భికారులుగా మిగిలే దుస్థితికి చేరుకున్నారు. వారిని ఎవరూ కాపాడతారనేదే ఇప్పుడు పెద్ద సమస్య. బుడమేరు, కృష్ణా కలిసి విజయవాడను ముంచేస్తే.. మున్నేరు వాగు జలసంద్రంగా మారి ఖమ్మాన్ని కూల్చేసింది. కనుచూపు మేరలో ఎటు చూసినా జలమే కనిపించిన నేపథ్యంలో ఇళ్లకు చేరేందుకు జనం ఇంకా భయపడుతూనే ఉన్నారు. వరద వస్తోందన్న వార్త వినిపించగా.. బెజవాడ ముంపు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నగరంలోని 16 డివిజన్లపై వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రతీ ఇంటిని మొదటి అంతస్తు వరకు పూర్తిగా వరద ముంచేసింది. అంబాపురం, కండ్రిక, పీఅండ్‌టీ కాలనీ, ఇందిరానాయక్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ తదితర లోతట్టు దూర ప్రాంత వాసులు మూడు రోజులుగా మంచినీరు కూడా లేకుండా విలవిల్లాడిపోతున్నారు.ఒక్క విజయవాడలోనే లక్షా 25 వేల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అంటే కనీసం మూడున్నర లక్షల మంది బాధితులున్నారని అంచనా వేస్తున్నారు. ఇక ఖమ్మం నగరంలో మున్నేరు వాగు పొంగి దాదాపుగా ఎనిమిది వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. జనాన్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చడంతో పాటు ఇప్పుడు మొట్టమొదటగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు… ఖమ్మంలో కూడా లక్షన్నర మంది వరకు బాధితులు ఉంటారని అంచనా…
విజయవాడలో దెబ్బతిన్న ప్రతీ ఇంటికి రెండు పోర్షన్లలో సామాన్లు పోయాయి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషన్, ఉంటే గింటే ఏసీ, చెక్క మంచాలు, ఫర్నీచర్, ఇనుప ఛైర్లు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. వాటిని అవతల పడేసి కొత్తవి కొనుక్కోవడం ఒక్కటే మార్గమని చెబుతున్నారు. టీవీ పాతిక వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ కూడా దాదాపు అదే రేటు ఉంటాయి. అంటే ఆ మూడు వస్తువులు కలిపి లక్షన్నరతో పాటు మంచాలు, ఫర్నీచర్ కలిపి మరో లక్ష వేసుకోవాలి. ఇక బురద నీటిలో నానిపోయిన స్టీలు సామాన్లను శుభ్రపరిచి వాడుకోవాలా వద్దా అన్నది వారివారి ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. మొత్తం రీప్లేస్ చేసుకోవాలంటే పది నుంచి పదిహేను వేల వరకు ఖర్చవుతుంది. గ్యాస్ బండలు నీటిలో కొట్టుకుపోవడంతో కొత్త గ్యాస్ సిలెండర్, దానితో పాటు స్టవ్ కొనుక్కోవాలంటే మరో పది వేల వరకు కావచ్చు. అంటే అప్పటికే మూడు లక్షల ఖర్చు కళ్లెదుటే కనిపిస్తోంది. ఇంట్లో చేరిన బురదను కడిగేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. దాన్ని తొలగించి ఇంటికి మరమ్మత్తులు చేసుకుని కొత్త పేయింట్లు వేయించుకోవడం, విద్యుత్ పరికరాలను సరిచేసుకోవడం లాంటి చర్యలకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చు కావచ్చు. అంటే పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ వరద కారణంగా ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది. రెండు నగరాల్లో బ్యాంక్ లోను తీసుకుని ఇళ్లు కట్టుకున్న వారు నెలవారీ వాయిదాలు కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఐదు లక్షలు ఎక్కడ నుంచి తెస్తారన్నదే పెద్ద ప్రశ్న. పైగా వరదల్లో వారి వస్తువులతో పాటు చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇంటి దస్తావేజులు, ఆధార్ , ఓటర్ కార్డులు కూడా కొట్టుకుపోయాయి. ఏ పని చేయాలన్నా ముందు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. వస్తువులు కొనుక్కునేందుకు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా.. వారికి వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇప్పిస్తుందా అనేది చూడాలి..
90 శాతం మంది బాధితులకు కట్టుబట్టలు మినహా అదనపు వస్త్రాలు లేవు. కొందరు దాతలు ఇచ్చిన బట్టలు వేసుకుని రోడ్లపై తిరుగుతూ కాలక్షేపం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం మరో పదిహేను రోజులు ఇదే సీన్ కనిపిస్తుంది. విజయవాడలో ఇళ్ల తలుపులు తీసి చూస్తే చాలా చోట్ల పాములు కాపురం చేస్తూ కనిపించాయి. దానితో వెంటనే బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. సింగ్ నగర్ లో అయితే వరద నీటిలో పాములు ఫ్రీగా తిరుగుతూ కనిపించడంతో జనం అటుగా వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇక ఖమ్మం పట్టణంలో వీధులన్నీ కుళ్లు కంపు కొడుతున్నాయి. అందుకే యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఏదేమైనా రెండు రాష్ట్రాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టం…