బీఆర్ఎస్ అడ్డంగా బుక్కయ్యింది. తెలంగాణ మొత్తం నీటిలో నానుతుంటే కారు పార్టీ అగ్రనేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్క హరీష్ రావు మినహా మిగతా ముగ్గురు నేతలు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు.సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా జనంలో తిరుగుతూ వారికి సాయం చేస్తుంటే… బీఆర్ఎస్ కనీసం ఉడుతా భక్తిగానైనా ఏమీ చేయడం లేదు. దీనితో తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి..
సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వర్షం, వరద పరిస్థితులను అంచనా వేస్తున్నారు. గంటగంటకూ అప్ డేట్స్ తీసుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన కుటుంబాలకు ఎలాంటి సాయం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను నాలుగు నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం, వీలైనంత త్వరగా ఆ సాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. పాడి గేదెలు చనిపోతే ఇచ్చే సాయాన్ని కూడా 50 వేలకు పెంచుతూ నిర్ణయించారు. వరద బాధితులకు సాయం అందించేందుకు కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఒక్కొక్కరికీ ఐదు కోట్ల చొప్పున మంజూరు చేశారు. ప్రతీ ఒక్క అధికారి 24 గంటలూ పనిచేసి బాధితులను ఆదుకోవాలని, నిత్యావసరాలను తక్షణమే పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్షం మాత్రం సామాజిక బాధ్యతలో విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు వాళ్లు ఎక్కడున్నారని జనం ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
సీఎం రేవంత్ ఖమ్మం వెళ్లివచ్చారు. మంత్రులు జిల్లాలోనే ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిద్రలేకుండా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంటింటికి వెళ్లి పలుకరిస్తున్నారు. బీఆర్ఎస్ బ్యాచ్ ఎక్కడా కనిపించడం లేదని జనం ఆగ్రహంగా ఉన్నారు..
మున్నేరు పొంగి ఖమ్మం మునిగిపోయింది. మహబూబాబాద్ అతలాకులమైంది. ఉత్తర తెలంగాణకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. కేసీఆర్, కవిత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి వేళలో.. బాధితులకు ధైర్యం చెప్పేందుకు.. వారి కష్టాల గురించి తెలుసుకొని.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపేందుకు విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బయటకు రావాల్సి ఉంది. అదేం సిత్రమో కానీ.. విపక్ష నేతగా ఉన్న వేళలోనూ ఫాంహౌస్ కు పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాల సమయంలో తాను ప్రజల తరఫున పోరాటం చేస్తానని.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి మళ్లీ పత్తా లేరు. తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తారని.. బాధితుల వెతల్ని వింటారని భావించారు. భారీ వరద కారణంగా గడిచిన మూడు,నాలుగు రోజులుగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికి..కేసీఆర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సాధారణంగా విపత్తులు విరుచుకుపడిన వేళలో.. అధినేతలు స్పందించటం.. వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించి.. బాధితులకు ధైర్యం చెప్పటం మామూలే. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయకపోవటం సంచలనంగా మారింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం స్పందించాల్సిన సమయంలోనూ కామ్ గా ఉండటం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇక ఆయన కూతురు కవిత కూడా ఎక్కడా కనిపించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బెయిల్ పొంది ఇటీవలే విడుదలైన కవిత విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో విశ్రాంతి ఉండదు. అలాంటిదేమైనా ఉంటే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఆ పని జరగాల్సి ఉంటుంది. కవిత బయట కనిపించకపోవడం పూర్తి స్థాయిలో వైఫల్యమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిన తర్వాత వరదలు వచ్చాయి. దానితో ఆయన వెనక్కి లేని పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. అమెరికా నుంచి మాత్రం కేటీఆర్ రోజుకు నాలుగు ట్వీట్స్ చేయడం విమర్శలకు తావిస్తోంది. బాధితుల్ని కలవటం.. వారిని ఓదార్చటంతో పాటు.. కొన్ని అంశాల్లో అప్పటికప్పుడు నిర్ణయాలను చకచకా తీసుకొని.. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి రేవంత్. ఇలాంటి పరిస్థితుల్లో విషయాల్ని గమనిస్తూ.. కాస్తంత మౌనాన్ని ప్రదర్శించటం ద్వారా ప్రజలకు తమను తలుచుకునేలా చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రతి చిన్న విషయానికి.. చితక విషయానికి తగదునమ్మా అన్నట్లు స్పందించటంలో అర్థం లేదని చెప్పాలి.అలా చేసే బదులు అమెరికా నుంచి కేటీఆర్ తక్షణమే తిరిగి వచ్చి జనంలో తిరుగుతూ పార్టీ తరపున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తే బావుంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఒక్కరే జనంలో తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయన బృందంపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఐనా హరీష్ రావు భయపడకుండా అక్కడే ఉన్నారు. ఆయనకు ఉన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీలో మిగతావారికి ఎందుకు లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబం.. వరద సాయం కింద రెండు వేల కోట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసి వారిని డిఫెన్స్ లో పడేశారు. బీఆర్ఎస్ ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వీటన్నింటికీ కూడా బీఆర్ఎస్ గట్టిగా సమాధానం చెప్పలేకపోతోంది. ఇకనైనా అర్థం చేసుకుని జనంలోకి వస్తే మంచిది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…