తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం ఊహించిందే కావడంతో దానిపై పెద్దగా చర్చ అవసరం లేదు. పీసీసీపై సీఎం రేవంత్ రెడ్డి గాలి వీచిందన్నది మాత్రం తేలతెల్లమవుతోంది. మహేష్ ఇప్పుడు రేవంత్ అనుచరుడిగా ఉంటారా. స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే అవుతోంది. మరో పక్క వచ్చే ఆరు నెలల్లో మహేష్ కుమార్ ఎదుర్కోబోయే సవాళ్లను చూస్తే మాత్రం ఆయనకు కత్తిమీద సామేనని చెప్పక తప్పదు…
కాంగ్రెస్ పార్టీ ఫస్ ఫ్యామిలీకి విధేయుడుగా రేవంత్ రెడ్డి బాగానే నెగ్గుకు వచ్చారు. రాహుల్ గాంధీ మద్దతుతో ఆయన అటు పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించారు జోడు గుర్రాలపై కాళ్లు పెట్టి ఇబ్బందిపడినట్లుగా కాకుండా ఆయన అనుకున్నవీ, అధిష్టానం ఆదేశించినవీ అన్నీ చేయగలిగారు. తనకు వత్తిడి ఎక్కువ అవుతుందని చెప్పుకుని పీసీసీ పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్తితుల్లో తనతో కలిసిపోయే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించారు. పీసీసీ ఎంపికలో రేవంత్ గాలి వీచిందని చెప్పేందుకు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గత ఎన్నికల్లో మహేష్ కుమార్ పోటీ చేయాలనుకున్నా…. రేవంత్ అభ్యర్థన మేరకు ఆయన ప్రచారానికి పరిమితమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అహర్నిశలు పనిచేశారు. తర్వాత రేవంత్ రెడ్డి చొరవతో ఆయనకు ఎమ్మెల్సీ దక్కింది. ఇప్పుడు కూడా రేవంత్ రికమండ్ చేసి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించారు. పార్టీకి పూర్తి వైభవం వచ్చే విధంగా పనిచేస్తానని మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు..
మహేష్ కుమార్ గౌడ్‌కు పార్టీలో కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. అధికారపార్టీలో లీడర్లు, కేడర్ మధ్య పటిష్టమైన సమన్వయం అవసరం. ఇందుకు ఆయన క్రియాశీలకంగా కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మెరుగైన సంబంధాలను నిర్మించాలి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నామినేటెడ్ పదవుల్లోని నాయకులను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పార్టీ చీఫ్, సీఎం మధ్య ఏకాభిప్రాయం అత్యవసరం. చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, పార్టీ, ప్రభుత్వంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణ మంత్రుల్లో దాదాపుగా అందరూ సీనియర్లే వారికి కోపం తెప్పించకుండా పీసీసీ అధ్యక్షుడు నడుచుకోవాలి. లేని పక్షంలో పార్టీలో గ్రూపు తగాదాలు మళ్లీ మొదలవుతాయి.ఇక పార్టీలో స్టేట్ మొదలు మండల స్థాయి వరకు వివిధ కమిటీలు పని చేస్తున్నాయి. ఆయా కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిపై ఉన్నది. గతంలో అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశారని పార్టీలో టాక్. ఇప్పుడు సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత మహేష్‌కుమార్ గౌడ్ పై ఉంది. త్వరలో కొత్త సవాలు ఎదురుకానుంది.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో మెజార్టీ మెంబర్లు గెలిచేందుకు కొత్త పీసీసీ చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉన్నది. పైగా టిక్కెట్ల కేటాయింపులో అసంతృప్తి లేకుండా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పవర్‌లో ఉండటంతో ఓ వైపు మంత్రులతో పాటు పార్టీలోని ఇతర పెద్దలు తమ అనుచరులను స్థానిక సంస్థల్లో దించేందుకు పార్టీపై ఒత్తిడి తేవడం సహజమే. ఇలాంటి సమయంలో పీసీసీ, ప్రభుత్వంలోని కీలక నాయకులకు మధ్య ఏకాభిప్రాయం అత్యంత ముఖ్యం. నామినేటెడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణ, పార్టీ కమిటీలు వంటి వాటిలోనూ పీసీసీ అధ్యక్షుడు తన అభిప్రాయాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ అంటేనే ముఠాతత్వానికి పెట్టింది పేరు. ఒకరు పైకి ఎక్కుతుంటే, నలుగురు కిందకు లాగుతుంటారు. నిజాయతీగా రాజకీయాలు చేసేందుకు అవకాశమివ్వకుండా, నిద్ర పట్టకుండా చేస్తుంటారు. అలాంటి వారిని సమన్వయం చేసుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఆయన సత్తా ఏమిటో ఆరేడునెలల్లో తేలిపోతుందన్న విశ్లేషకుల వాదన…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…