బుడమేరు మళ్లీ పొంగితే…అంతేనా…

By KTV Telugu On 9 September, 2024
image

KTV TELUGU :-

బెజవాడ వాసుల ఇంకా ఎన్ని రోజులు ఇలా నిద్రలేని రాత్రులు గడపాలో అర్థం కావడం లేదు. అలా బుడమేరు మూడు గండ్లు పూడ్చారో లేదో ఇలా మరోసారి వరద పొంగుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ నగరంలో శుభ్రపరిచిన ప్రదేశాల్లోనే రెండు అడుగుల నీరు వచ్చి చేసిన పని మొత్తాన్ని సర్వనాశనమైంది. ఇప్పుడు మళ్లీ నగరవాసులను వరద భయం  పట్టుకుంది. పది రోజులకు పైగా  బెజవాడ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన  బుడమేరు ఇప్పటికప్పుడు వారిని వదిలేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమేరు మూడు గండ్లు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరిగిపోతోంది. దీనికి తోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు థాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గండ్లను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి.. నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి చూస్తున్నారు.సమయం లేదు మిత్రమా పనులు వేగంగా జరగాలని ఆదేశిస్తున్నారు. దానికి  ప్రత్యేక కారణం కూడా ఉంది. ఎందుకంటే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడటంతో ఇవాళ, రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలోని అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఐనా సరే జనం ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యంగా విజయవాడకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ఉధృతిని దిగువకు విడుదల చేయడం మరో సమస్య అవుతోంది.  మరో పక్క బుడమేరుకు నీరు వచ్చే ప్రాంతాలన్నీంటిలో ఎక్కువ ప్రవాహం కనిపిస్తోంది. దాని వల్ల బుడమేరు ఉధృతి పెరిగి, నీటి మట్టం పెరిగినట్లయితే ఇప్పుడు పూడ్చిన గండ్ల వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణతో  బుడమేరు గండ్లు పూడ్చిన చోట్ల కట్ట ఎత్తు పెంచే ప్రక్రియ మొదలైంది. వరద నీరు విజయవాడ సిటీలోకి రాకుండా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అది అంత సులభం కాదని  భావిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి