భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
HYDRA: టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక
హైదరాబాద్ : భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.తరతమ భేదాలు లేకుండా ఆక్రమణలు జరిగినల్లు తేలితే ఉపేక్షించట్లేదు. దీంతో ఇన్నాళ్లు తమకు ఎదురేలేదని భావించిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
మొన్నటికి మొన్న మాదాపూర్‌లోని తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ని కట్టారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన హైడ్రా(HYDRA) అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. కన్వెన్షన్ యజమాని హీరో అక్కినేని నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోపే ఎన్ కన్వెన్షన్‌ని నేలమట్టం చేశారు. ఇలా భాగ్యనగరవ్యాప్తంగా ఆక్రమణల తొలగింపుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు పంపింది.
మురళీమోహన్‌కు(Murali Mohan) చెందిన జయభేరి(Jayabheri) సంస్థకు ఈ నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో జయభేరి సంస్థ అక్రమంగా నిర్మాణాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించి.. ఆక్రమణలు నిజమేనని తేల్చారు. జయభేరి సంస్థకు నోటీసులు అందజేశారు.
15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని అందులో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. నోటీసులపై మురళీమోహన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతోందని ఆసక్తి నెలకొంది. ఎన్ కన్వెన్షన్ విషయంలో హైడ్రా అధికారులు అవలంభించిన ధోరణి సీనియర్ నటుడికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. నోటీసులపై ఆయన న్యాయ సలహా కోరుతున్నట్లు, అవసరాన్ని బట్టి న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…