తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది. నాయకత్వ మార్పు అనివార్యమన్న సంకేతాలు వస్తున్నాయి. ఎంతో మంది టీబీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నప్పటికీ మళ్లీ బండి సంజయ్ కే అవకాశం వస్తుందన్న టాక్ నడుస్తోంది. పార్టీ కార్యకర్తలు సైతం దూకుడుగా ఉండే సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు అంతర్గతంగా జరిగిన సర్వేలో తేలింది. దానితో ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు దిక్కుతోచడం లేదు. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా లేక బండి సంజయ్ నే మళ్లీ తీసుకురావాలో వారికి బోధపడటం లేదు….
రాష్ట్ర బీజేపీలో మార్పులు అనివార్యమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ డీలాపడిపోయిన నేపథ్యంలో పరుగులు పెట్టించగల నాయకుడు అవసరమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు చాలా రోజులు ఉన్నప్పటికీ.. ఆ రోజు వరకు పార్టీని సమర్థంగా నడిపిస్తూ ఎప్పటికప్పుడు కార్యకర్తలను ఉత్తేజ పరచగల నాయకుడి కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు పరిశీలనకు వచ్చినట్లు కొంత కాలం క్రితం చర్చ జరగ్గా.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పావులు కదులుతున్నాయి..ఆ దిశగా కేంద్ర సహాయ మంత్రి అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వైపు అందరూ చూస్తున్నారు. 2020 మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు రాష్ట్రంలో పార్టీకి వచ్చిన, తెచ్చిన ఊపు అంతాఇంతా కాదు. ఒకవిధంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సంజయ్ అధ్యక్షుడికి ముందు.. ఆ తరువాత అన్నట్లుగా ఎవరైనా అంటుంటారు. అందుకే.. బీజేపీ అభిమానులు ఇప్పుడు మళ్లీ సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పార్టీకి ఆయన అయితేనే వంద శాతం న్యాయం చేస్తారని అంటున్నారు. బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి వరకూ వెళ్లిందంటే అది ఆయన చలువేనని.. ప్రతి గడపకు కమలం పువ్వు పరిచయం అయిందంటే ఆయనే కారణమని చెప్తున్నారు.
ఒకప్పుడు తెలంగాణలో బీజేపీని కేవలం జాతీయ పార్టీగానే పరిగణించేవారు. ఒకటి రెండు అసెంబ్లీ స్థానాలు సాధిస్తే గొప్ప అన్నట్లుగా చూసేవారు. పొత్తులో భాగంగా ఎంపీ సీట్లు వస్తుండేవి. ఇప్పుడు ముక్కోణ పోటీ స్థిరపడిపోయిన నేపథ్యంలో గట్టి నాయకత్వం అనివార్యమవుతోంది.
ప్రస్తుత టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రంలో కీలక మంత్రిపదవిని నిర్వహిస్తున్నారు. ఆయన్ను కేంద్రంలో ఉంచడమే బెటరని, రాష్ట్ర నాయకత్వ బాధ్యత నుంచి రిలీఫ్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఆ పరిస్థితుల్లో బండి సంజయ్ నీ తీసుకొచ్చి మళ్లీ కూర్చోబెట్టాలని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీనే ఎదిరించి, కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపించిన నేతగా బండి సంజయ్ జనంలో పరపతి పెంచుకున్నారు. ఆయన నిర్వహించిన ప్రతీ కార్యక్రమం, ప్రతీ యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన్ను టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతున్న తరుణంలో మళ్లీ బండి సంజయ్ ను తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చేరికల కమిటీ చైర్మన్ గా ఆయన విఫలమయ్యారన్న ఆరోపణలే అందుకు కారణంగా చెబుతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో సంజయ్ ఒక్కరే సరైన నాయకుడని, రేవంత్ రెడ్డిని గట్టిగా ఎదుర్కోగలరని భావిస్తున్నారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…