తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు దిక్కుతోచడం లేదు. అధినేత తీరు అర్థం కాక ఏం చేయాలోనని తలపట్టుకు కూర్చుంటున్నారు. ఎన్నాళ్లీ మౌనరాగాలని నుసుగుతూ, గట్టిగా అడగలేక లోలోన మథనపడుతున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడో తెలియక తలపట్టుకు కూర్చుంటున్నారు. తమ ఆశలపై విజయవాడ వరదలు నీళ్లు చల్లడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు దిక్కు తోచడం లేదు. దసరాకు విడుదల అన్న మాట నిజమా కాదా అని తమలో తాము చర్చించుకుంటున్నారు….
ఏ పార్టీలోనైనా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేనే ఉంటారు.మిగిలిన క్రియాశీల నేతలకు ఏదోక నామినేటెడ్ పదవి ఇచ్చి అధిష్టానం సంతృప్తి పరుస్తుంది. అదృష్టం బావుంటే వాళ్లు కూడా పావలో బేడో సంపాదించుకుంటారు. టీడీపీలో కూడా ఇంతకాలం అదే ఆలోచనతో ఉన్న పార్టీ కేడర్ ఇప్పుడు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఆగస్టు మొదటి వారంలో నామినేటెడ్ పదవులు జాబితా విడుదలవుతుందని అందరూ ఎదురు చూశారు. జిల్లాల వారీగా పేర్లు కూడా వాళ్లే లీకులు ఇచ్చుకున్నారు. ఒక మీడియా అధిపతికి టీటీడీ బోర్డ్ ఛైర్మన్ ఇస్తారని ప్రచారం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఆర్టీసీ ఛైర్మన్ ఇస్తారన్నారు. అంతలోనే వాయిదా వేసినట్లుగా వార్తలు కూడా ప్రచారమయ్యాయి. ఈ రెండు మాటలు చంద్రబాబు నోటి నుంచి రాలేదు. ఆయన ఎవరితోనూ ప్రచారం చేయించలేదు. కేడరే అవునన్నది, తర్వాత కాదన్నది. శ్రావణ, భాద్రపదం పోయి, దసరా అంటే ఆశ్వీయుజమాసానికైనా పదవులు వస్తాయా రావా అన్న ప్రశ్న తలెత్తుతోంది..
తెలుగుదేశం పార్టీ అధినేత అయిన సీఎం చంద్రబాబు నాయుడుకి నాన్చుడు మాస్టర్ అన్న పేరు ఉంది. ఏ విషయాన్ని వెంటనే పరిష్కరించకుండా ఆయన నాన్చుతుంటారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అదే జరుగుతోంది. దానితో పదవులను ఆశించిన కేడర్ కు దిక్కుతోచడం లేదు…
టీడీపీ, జనసేన పార్టీల్లో ఏ నియోజక వర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే 60, 30 శాతాలు పదువుల పంపకం జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలను బట్టి ఎవరికి ఏ పదవో కూడా డ్రీమ్స్ లోకి వెళ్లిపోయారు. అయితే లెక్కకు మిక్కిలిగా సిఫార్సు లేఖలతో జనసేన, టీడీపీ కార్యాలయాలకు వారి వారి పరిచయాలను బట్టి అధిష్టానం వద్దకు వెళ్లారు. ఆ లేఖలతో హెడ్ ఆఫీసులు నిండిపోయాయి. లెటర్ ఇవ్వటం ఒక ఫోటో తీసుకోవటం మరుసటి రోజు పేపర్ లో న్యూస్ రాయించుకోవటం రివాజుగా మారింది. ఆ ఫోటో చూపించి… చూపించి అదిగో పదవి వచ్చేసిందని చెప్పుకున్నారు.టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక ఆలయ పాలక మండలి నియామకం విషయంలోనూ జాప్యం జరుగుతూనే ఉంది. దానితో చైర్మన్ గా రోజుకు ఒకరి పేరు తెరపైకి వస్తోంది. వేర్వేరు ఆలయాల పాలకమండళ్లలో సభ్యత్వం కోసం పెద్ద క్యూ కనిపిస్తోంది. దేవాదాయ మంత్రి అయితే తనను కలిసిన వారందరికీ అదిగో ఇదిగో అని టైమ్ పాస్ చేసేస్తున్నారు. ఐదు వేల గుళ్లకు కమిటీలు వేస్తామని చెప్పి ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. ఇతర పదవుల విషయంలోనూ అదే తీరు కనిపిస్తోంది. ఐదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేయడం, పార్టీ పట్ల సానుభూతితో జగన్ పై పోరాటం చేయడం లాంటి పనులకు దిగిన వారికి ఇంత వరకు న్యాయం చేయలేదు. దసరాకైనా చంద్రబాబు కరుణిస్తారో లేదోనని కేడర్ ఎదురుచూస్తోంది. పైగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి మాట్లాడే సీన్ ఇప్పుడు లేదు. ఆయనే ఇంటికి, పార్టీ ఆఫీసుకి వెళ్లకుండా 24 గంటలూ వరద సహాయ చర్యల్లో మునిగి తేలుతున్నారు….
చంద్రబాబు తన పార్టీ కేడర్ ను సంతృప్తి పరచాలనుకున్నారా.. లేదా అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతోంది. వైసీపీ వాళ్లు ఎక్కడ విమర్శిస్తారోనన్న భయం ఆయనలో ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వైసీపీ వాళ్లపై చర్యలకు రెడ్ బుక్ ఉన్నట్లే, నామినేటెడ్ పదవుల భర్తీకి ఒక గ్రీన్ బుక్ కూడా ఉంటే బావుంటుందని కొందరు వాదిస్తున్నాయి. ఎన్ని మాట్లాడినా చంద్రబాబు వింటే కదా..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…