మద్యం సీసాలను సీజ్ చేసిన గుంటూరు పోలీసులు

By KTV Telugu On 11 September, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా,  ఒక్కసారిగా కొంతమంది మందు బాబులు అక్కడికి వచ్చి.. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఏకంగా పోలీసుల కళ్లెదుటే మందుబాబులు మద్యం సీసాల కోసం ఎగబడ్డారు. దీంతో గందరగోళం నెలకొంది. మందు బాబులు మద్యం సీసాల వైపు దూసుకురావడంతో.. ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు.

దీంతో ఎవరికి దొరికిన బాటిళ్లను వారు ఎత్తుకెళ్లారు. కాసేపటికే తేరుకున్న పోలీసులు.. కొందరిని అదుపు చేసి.. వారు నుంచి మద్యం సీసాలను లాక్కున్నారు. అప్పటికే చాలా మంది మద్యం బాటిళ్లతో పరారయ్యారు దీంతో స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.  ఈ ఇష్యూపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నప్పుడు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలే వైన్స్ బంద్ అంటున్నారు. అందుకే ఇలా ఎగబడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షల విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని నల్లచెరువులోని డంపింగ్‌యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఇలా సీజ్‌ చేసిన మద్యం సీసాలను ప్రొక్లోయిన్‌తో తొక్కించి ధ్వంసం చేస్తుంటారు. అయితే ప్రొక్లెయిన్‌ అక్కడికి చేరుకోవడానికి సోమవారం కొంత సమయం పట్టింది. ఈ లోపు పోలీసులు మద్యం సీసాలను రోడ్డుపై పేర్చారు. ప్రొక్లెయిన్‌ వచ్చాక.. వాటిని ధ్వసం చేయడం ప్రారంభించిన కాసేపటికే అధికారులు వెళ్లిపోయారు. ఈ తతంగం చూడానికి వచ్చిన స్థానికులు అదును కోసం ఎదురు చూడసాగారు.

అధికారులు వెళ్లిపోగానే అమాంతం దూసుకొచ్చి మద్యం బాటిళ్లను పట్టుకుని పారిపోసాగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. వాళ్లను దొరక బుచ్చుకుని ప్రశ్నించగా.. ‘వృద్ధాగా నేలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాం.. సర్‌! క్షమించండి’ అంటూ కహానీలు చెప్పసాగారు. కొంత మంది నుంచి మద్యం బాటిళ్లను పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుంది. పారిపోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్‌ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అక్టోబర్‌ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ లో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో.. ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మద్యం ప్రియుల జేబులు గుల్ల కావడమే కాకుండా.. ఆరోగ్యమూ చెడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి