పారిశ్రామికవేత్త, అమరరాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న జయదేవ్, ఈ సారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. పెద్దల సభకు రెండు ఖాళీలు వస్తున్న నేపథ్యంలో ఒక స్థానాన్ని గల్లాకు కేటాయించేందుకు చంద్రబాబు తీర్మానించుకున్నారు. ఈ మేరకు గల్లాకు సంకేతాలు కూడా వెళ్లాయి. జయదేవ్ అన్ని విధాలుగా టీడీపీకి ఉపయోగపడతారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం…
గల్లా జయదేవ్ పారిశ్రామిక కుటుంబమే కాదు. రాజకీయ కుటుంబం కూడా. ఆయన మాతృమూర్తి గల్లా అరుణ కుమారి నాలుగు పర్యాయాలు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తర్వాతే రాజకీయాల్లోకి వచ్చిన గల్లా జయదేవ్ రెండు సార్లు గుంటూరు లోక్ సభా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. గత వైసీపీ ప్రభుత్వం తమ అమర్ రాజా బ్యాటరీస్ సంస్థపై కక్షగట్టడంతో విసిగిపోయి… సంస్థను ఆయన తెలంగాణకు మార్చిన నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించి వైదొలిగారు. దాదాపుగా రాజకీయ సన్యాసం చేశారని భావిస్తున్న తరుణంలో జయదేవ్ కు మరో అవకాశం రాబోతోంది. మొదటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపాలని పార్టీ అధినేత నిర్ణయించుకున్నారు. దానితో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవసరం లేకుండా జయదేవ్ పార్లమెంటుకు వెళ్లే అవకాశం రాబోతోంది. పారిశ్రామికవేత్తల కోటాలో ఆయనకు ఛాన్సిచ్చినట్లవుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి…
గుంటూరు లోక్ సభకు ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు…ఇప్పుడు జయదేవ్ ను రాజ్యసభకు పంపుతున్నారు. దీని వల్ల ఎగువ సభలో టీడీపీ వాయిస్ వినిపించే అవకాశం వస్తోంది. పైగా గల్లా జయదేవ్, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. ఏపీకి సంబంధించిన సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్న విశ్వాసమూ ఉంది….
చంద్రబాబు ఆదేశాల మేరకే జయదేవ్ రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. నిజానికి రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడే ఇద్దరు వైసీపీ సభ్యులు రాజీనామా చేసి, టీడీపీలో చేరుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వారి స్థానంలో ఇద్దరు టీడీపీ వారు ఎన్నికయ్యే అవకాశం ఉంది. మళ్లీ పోటీ చేసేందుకు మోపిదేవి వెంకటరమణ విముఖత వ్యక్తం చేయడంతో ఆయన స్థానంలో గల్లాను రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయించుకుంది. నిజానికి గల్లాను కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించాలని చంద్రబాబు భావించారు. రాజ్యసభ సీటు ఖాళీ కావడంతో నిర్ణయం మార్చుకుని జయదేవ్ ను ఎగువ సభకు పంపబోతున్నారు.
రాజ్యసభలో టీడీపీ తరపున కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండేందుకు గల్లాను నియమిస్తున్నారని కొన్ని వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే అది నిజం కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జయదేవ్ రాజకీయ అనుభవం, వేర్వేరు అంశాలపై ఆయన అవగాహన ఆధారంగా టికెట్ ఇస్తున్నారని చెబుతున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…