తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో డ్యామ్‌ గేట్లు ఎత్తివేత

By KTV Telugu On 12 September, 2024
image

KTV TELUGU :-

తుంగభద్ర ప్రాజెక్ట్‌ ప్రమాదకర పరిస్థితిలో ఉందా? అంటే ఔనంటున్నారు నిపుణులు. 70 ఏళ్ల కింద అమర్చిన డ్యామ్‌ గేట్లు ఇపుడు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. మొత్తం డ్యాం గేట్లు మార్చకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. డ్యాం గేట్లకు కాల పరిమితి ఉంటుందా? మిగతా డ్యాంల గేట్ల పరిస్థితి ఏంటి?

ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ నిండుకుంది. దీంతో వరదల ఉధృతంగా రావడంతో డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ గేటు వద్ద స్టాప్‌లాక్ గేట్లను విజయవంతంగా అమర్చారు. అయితే, ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవిత కాలం 45 ఏళ్లు మాత్రమేని డ్యామ్ నిపుణుల కమిటీ స్పష్టంచేసింది. ఇప్పటికే ఆ గేట్లను 25 ఏళ్ల పాటు వినియోగించారని పేర్కొన్నారు.గేట్లను ఇకమీదట మార్చకపోతే ప్రమాదం పెను ప్రమాదం పొంచి ఉన్నదని హెచ్చరించారు.దీంతో తాజాగా తుంగభద్ర డ్యామ్ నిపుణుల బృందం మరో కీలక హెచ్చరిక చేసింది. డ్యామ్ 22వ గేటు దిగువ భాగాన భారీ గొయ్యి ఏర్పడిందని తేల్చారు.ఆ గొయ్యి వలన రిజర్వాయర్ పునాదులు దెబ్బతినే అవకాశం ఉందని వెల్లడించారు. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు పార్కులో బోటింట్ కోసం ఏర్పాటు చేసిన సరస్సు తూముల నుంచి లీకేజీ ఏర్పడిందని తెలిపారు. అది కూడా డ్యామ్‌కు డ్యామేజ్ చేయవచ్చునని, కొంతకాలంలో డ్యామ్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణుల కమిటీ సూచించింది.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్‌ ప్రమాదకర పరిస్థితిలో పడిపోయింది. ఆగస్టు 10న భారీ వరదలకు తుంగభద్ర క్రస్ట్‌గేటు కొట్టుకుపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఏపీ-కర్ణాటక ప్రభుత్వాలు హుటాహుటిన చర్యలు చేపట్టాయి. ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలిక సాఫ్ట్‌లాక్ గేట్‌ను అమర్చారు. వరదనీరు వృథాగా పోకుండా అడ్డుకోగలిగారు.

అయితే తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది..? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం..? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. దీంతో తుంగభద్ర ప్రాజెక్ట్‌ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఏకే బజాజ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ తుంగభద్ర డ్యామ్‌ను ఇటీవల సందర్శించింది. మిగతా 32 గేట్ల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం-తుంగభద్ర డ్యామ్ భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.

నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మొత్తం మార్చాల్సిందేనని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమేనని.. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడితే ప్రమాదాన్ని కోరి కొనితెచ్చుకున్నట్లేనని సేఫ్టీ కమటీ హెచ్చరించింది. 70 ఏళ్ల కిందట అమర్చిన 33 గేట్లను కచ్చితంగా మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది.

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో హోస్పేట్ సమీపంలో తుంగభద్ర నదిపై డ్యామ్‌ కట్టారు. 1953లో డ్యామ్‌ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్యామ్ నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. కానీ, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో పూడిక పేరుకుపోవడంతో 100 టీఎంసీలకు పడిపోయింది. డ్యామ్‌ గేట్లను మార్చడంతో పాటు పూడిక తీస్తే ప్రాజెక్టు మనుగడకు ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి