ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు..వరదలతో భారీగా నష్టపోయింది. ఆర్దికంగా ఇబ్బందులతో ఉన్న వేళ కేంద్ర సాయం కోసం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ కోరుతున్నారు,. కేంద్ర సాయం పైన రేవంత్ ఆశలు పెట్టుకున్నారు. ఇక, కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. వరదల వల్ల ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి దిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చింది. వరదల వల్ల నష్టపోయిన జిల్లాల్లో పర్యటించింది. ఈ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాల కారణంగా రూ.9 వేల కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని నివేదిక అందించింది. బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని విన్నవించింది. సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నాగర్కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని పేర్కొంది.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్జిల్లాల్లోని పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మొదటిగా ప్రాథమిక నష్టం రూ.5,438 కోట్లుగా అంచనా వేయగా, అది దాదాపు రెట్టింపైంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు, వరదలకు 35 మంది చనిపోయారు. 28,869 ఇళ్లు కూలగా, 17,916 మంది నిరాశ్రయులు అయ్యారు. వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్కేపీ సింగ్నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
తక్కువ సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం తగ్గిందని అధికారులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా చేయడానికి అవసరమైన నిధులను ఉదారంగా అందించాలని కోరారు. ఇటు కేంద్ర సాయం పై సీఎం రేవంత్ ప్రధాని, అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరారు. అమిత్ షాతో భేటీ ఖరారైంది. కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్రం నుంచి సాయం కోసం రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందీ..ఏ మేర అండగా నిలుస్తుందనేది కీలకంగా మారుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…