జనసేనాని పవన్ కల్యాణ్ ఏ పని చేసినా ప్రజలకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. పది మందికి మంచి మాటలు చెప్పి,చేతనైతే నాలుగు మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తారు. అక్రమార్కుల పాలిట చండశాసనుడిగా ఉండే పవన్ కల్యాణ్… తాను కూడా నిక్కచ్చగా, నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వంలో పవన్ పాత్ర కీలకం. నాలుగు శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆపై డిప్యూటీ సీఎం హోదా ఉంది. కూటమి ప్రభుత్వం ఉండడంతో పవన్ కు సరైన ప్రాధాన్యత దక్కుతోంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు పవన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన అభివృద్ధికి తగ్గట్టు పల్లె పాలనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను కేటాయించారు. ఆయన కోసం విజయవాడలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే పవన్ ఆది నుంచి ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. మంత్రిగా జీతభత్యాలు తీసుకోవడం లేదు. తనకు ఫర్నిచర్ సైతం ఏర్పాటు చేయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుతో పాటు అన్ని వసతులను సమకూర్చారు. కానీ వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోంది. కేవలం పవన్ క్యాంపు కార్యాలయం కోసమే 82 లక్షలు ఖర్చు పెట్టారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది. దీనికి చెక్ చెప్పే విధంగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసే అవకాశం ఇవ్వబోనని చెబుతూ.. విజయవాడ క్యాంప్ ఆఫీసును ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంప్ ఆఫీసుగా మార్చుతున్నట్లు తెలిపారు. దానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. తన క్యాంపు ఆఫీసులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పుకున్నారు. దానితో ఇప్పుడు విమర్శించేందుకు వైసీపీ నేతలు కొత్త టాపిక్ వెదుక్కోవాల్సి వస్తోంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…