ఏపీ, తెలంగాణలో పుంజుకోలేకపోతున్న బీజేపీ

By KTV Telugu On 19 September, 2024
image

KTV TELUGU :-

కేంద్రంలో వరుసగా ముూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో పరిస్తితి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఏపీలో టీడీపీ పుణ్యమాని సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్న ఆ పార్టీ, తెలంగాణలో మాత్రం ఎనిమిది మంది ఎంపీలు, అంతే స్థాయిలో ఎమ్మెల్యేలున్నా ఏమీ సాధించలేకపోతోంది. ఏపీలో టీడీపీ, జనసేన నీడన ఉంటున్న బీజేపీకి కేడర్ బలం పెరగడం లేదు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకునేలా చేయాలని, సభ్యత్వాలను పెంచాలని కేంద్ర నాయకత్వం టార్గెట్ విధించినా.. డీలాగా పడున్న రాష్ట్ర నేతలు ఎటు కదలకుండా కూర్చున్నారు. కనీసం లక్ష మంది కొత్త వారిని చేర్చాలన్న ఆదేశాలను ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా సభ్యత్వ రుసుమును రెండు వందల రూపాయలు పెడితే ఎవరు చేరతారని బీజేపీ నేతలే ప్రశ్నించుకుంటున్నారు. ఏదో మొక్కుబడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి వెళ్లిపోయిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా టీడీపీ వాళ్లు ఫ్రీగా సభ్యత్వమిస్తుంటే.. మీకు డబ్బులు కట్టి ఎవరు చేరతారని జనం ప్రశ్నిస్తున్నారు.ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణు వ‌ర్థ‌న్‌రెడ్డి, మాధ‌వ్ వంటి ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయ‌కులు స‌భ్య‌త్వాన్ని త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా వదిలేశారు. అంతా పురందేశ్వ‌రి చూసుకుంటున్నార‌ని.. తమ చేతిలో ఏమీ లేదన్న‌ట్టుగా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం చేసిందేమిటని జనం ప్రశ్నిస్తుంటే నీళ్లు నమలడం ఏపీ బీజేపీ నేతల వంతయ్యింది. ఒక దశలో పురంధేశ్వరిని తొలగించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ నిర్ణయం కూడా వాయిదా పడిందని చెబుతున్నారు. దానితో ఎవరు ఉంటారు, ఎవరు పోతారు, ఎవరు టెంపరరీ, ఎవరు పర్మినెంట్ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.

తెలంగాణలో పరిస్థితి ఏమంత బాగోలేదు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొక్కుబడిగా మాత్రమే రాష్ట్ర శాఖను పట్టించుకుంటున్నారు. ఢిల్లీలో పరపతి పెంచుకోవడం తప్ప రాష్ట్ర శాఖను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం వారికి కనిపించడం లేదు. పైగా కిషన్ రెడ్డిని రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారన్న చర్చ మరికొంత అనిశ్చితికి దారితీసింది.కాబోయే టీబీజేపీ అధ్యక్షుడు ఎవరన్న చర్చకు కూడా ఇంకా తెరపడలేదు. మళ్లీ బండి సంజయ్ కే ఆ పదవి ఇస్తారని కొందరంటుంటే… ఈటల రాజేందర్ కు అవకాశం వస్తుందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. దానితో పార్టీ కేడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల్లో ఐకమత్యం లేదని, శాసనసభా పక్షంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారయ్యారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియా స్పేస్ మొత్తం తీసేసుకుంటున్నారు. దానితో మీడియాతో బీజేపీ నేతలకు సరైన ప్రాధాన్యం లభించకపోవడం కూడా సమస్యగా మారింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి