పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఎప్పుడేం జరిగిందో వివరించారు. జూన్ 4వ తేదీన రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, జులై 12వ తేదీన నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17వ తేదీన అక్కడ టెస్టులు చేశాక రిపోర్టులు సరిగ్గా రాకపోవడంతో ఎన్డీడీబీకి పంపించారని వివరించారు.
శ్రీవారికి పంపించిన నెయ్యిలో యానిమల ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ అదే నెల 23వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపించిందని వివరించారు. జంతువుల కొవ్వు ఉండటం వల్ల టీటీడీ అధికారులు ఈ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జులై 23వ తేదీన నివేదిక అందింతే ఈ రెండు నెలలు చంద్రబాబు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
ఈ విషయాన్ని అప్పుడే ఎందుకు బయటపెట్టలేదని, ఎందుకు రెండు నెలల పాటు ఆగారని నిలదీశారు. జంతువుల కొవ్వు శాతం ఉన్న నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వంలోని టీటీడీ అధికారులు లడ్డూ తయారీకి వినియోగించకపోయినా ఎందుకు ప్రస్తావించారని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్‌గా అభివర్ణించారు. సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపై తెచ్చారని ఆరోపించారు. ఈ వివాదాన్ని అక్కడితో వదిలేయదలచుకోలేదు వైఎస్ జగన్. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లదలిచారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారిద్దరికీ లేఖ రాయనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఇది ఇలావుండగా, తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని ఈవో పేర్కొన్నారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని ఆ నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించానని అన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు. రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని.. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు ఎవరూ సరఫరా చేయలేరని ఈవో వివరించారు. మేం హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని తెలిపారు. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్లు ఎన్డీడీబీ తేల్చిందని ఈవో అన్నారు. నెయ్యి తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేసినట్లు తెలిపారు. రూ.75 లక్షల విలువైన నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిందని ఈవో వెల్లడించారు.
ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ తాజాగా దీనిపై స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడించింది. జూన్, జులైలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్ పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా అయినట్లు తెలిపింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని స్పష్టం చేసింది. కానీ, తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడింది. టీటీడీ కోరితే టెస్ట్ రిపోర్టులు పంపామని.. టీటీడీ తమకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదని ఏఆర్ డెయిరీ పేర్కొంది. అయితే, ఇప్పుడు తమ డైరీ టీటీడీకి సరఫరా చేయడం లేదని తెలిపింది. తమ ఏఆర్ డెయిరీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా అందిస్తున్నామని పేర్కొంది. 25 సంవత్సరాలుగా తాము డెయిరీ నడుపుతున్నామని.. ఎప్పుడూ తమ డైరీపై ఇలాంటి ఆరోపణలు రాలేదని తెలిపింది.
తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు తెలిపారు. 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపినట్లు టీటీడీ ఈవో తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఎన్డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైనదని ఆ ల్యాబ్ గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉందని తెలిపారు. ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలిందన్నారు ఈవో. జులై 6న నెయ్యిని ప్రయోగశాలలకు పంపామని వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు రెండు విభాగాలుగా ఇచ్చారని ఆ రిపోర్టులో నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయని వివరించారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. దీంతో నెయ్యిలో బాగా కల్తీ జరిగిందని తేలిపోయిందన్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…