మూలిగే నక్కపై తాటికాయ పడే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది. నెలవారీ ఖర్చులు భరించలేక నానా తంటాలు పడుతున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వం మరో బ్యాడ్ న్యూస్ చెప్పబోతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయన్నది విశ్వసనీయ సమాచారం. కొత్త రేటు దీపావళి తర్వాత ఉంటుందని కొందరు అంటున్నారు. అసలే నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటిన నేపథ్యంలో జేబులు ఖాళీ అవుతున్నాయని సగటు వినియోగదారుడు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఛార్జీల మోతకు ప్రభుత్వం సిద్ధం కావడంతో చేసేదేమీ లేక రాష్ట్ర పేద, మధ్య తరగతి వర్గాలు దిక్కులు చూస్తున్నారు…
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇటీవలే విద్యుత్ నియంత్రణా మండలికి సమర్పించింది. దక్షిణ, ఉత్తర డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటును వెల్లడించాయి. మెుత్తం 14 వేల 222 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. మెుత్తం లోటులో 13 వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. అవి పోగా.. మిగిలిన 1,200 కోట్ల లోటును ఛార్జీల సవరణ ద్వారా పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు రెండు డిస్కంలు వెల్లడించాయి. అయితే ఈ విద్యుత్ భారం గృహ వినియోగదారులపై అంతగా పడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. గృహ అవసరాలకు విద్యుత్ నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఆ మెుత్తాన్ని 40 పెంచి 50 రూపాయలు వసూలు చేసేందుకు అనుమతించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
నిజానికి తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందిస్తోంది. ఇక 299 యూనిట్ల వరకు వాడుకునే గృహాలకు స్థిరఛార్జీ పెంపు ఉండదు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.30 కోట్లకు పైగా ఇంటి కరెంటు కనెక్షన్లు ఉంటే.. వీటిలో 300 యూనిట్ల పైగా వాడుకునే వారు 20 శాతం ఉన్నట్లు గుర్తించారు. వారికి మాత్రమే పెరిగిన ఛార్జీలు వర్తించే ఛాన్స్ ఉంది. 80 శాతం వినియోగదారులకు పెరిగిన ఛార్జీల భారం పడదని డిస్కంలు చెబుతున్నాయి. తాగా, డిస్కంల ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఛార్జీల పెంపుపై ఈఆర్సీ తుది తీర్పు వెలువరిస్తుంది. అనంతరం ఛార్జీల సవరణ అమలుల్లోకి రానుంది. ఈ మొత్తం ప్రక్రియకు పూర్తి కావటానికి మూడు నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…