ఆఫీస్‌లో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఆ టెకీ గత 2 నెలలుగా డిప్రెషన్ పోగొట్టుకునేందుకు చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల పూణేలో ఓ యువ సీఏ పని ఒత్తిడి తట్టుకోలేక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం మరిచిపోకముందే ఈ ఘటన మరోసారి తీవ్ర సంచలనంగా మారింది.
ఇటీవలి కాలంలో ఆఫీస్‌లలో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం పాలు కావడం, ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పూణేలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీకి చెందిన ఓ యువ ఉద్యోగి పని ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై రాజకీయ నాయకులే కాకుండా పలు వ్యాపారవేత్తలు స్పందిస్తున్నారు. తాజాగా చెన్నైలో మరో ఉద్యోగి వర్క్ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన కార్తికేయన్ అనే 38 ఏళ్ల వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు కాగా.. వారంతా చెన్నైలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే కార్తికేయన్.. డిప్రెషన్‌తో బాధపడుతూ చెన్నైలోని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పని ఒత్తిడి కారణంగానే కార్తికేయన్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసినట్లు చెన్నై పోలీసులు వివరించారు. గత 15 ఏళ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కార్తికేయ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.
ఇక.. కార్తికేయ ఆఫీస్‌లో తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆయన భార్య పేర్కొన్నారు. రెండు నెలలుగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన భార్య కే జయరాణి, పిల్లలు.. పుట్టింటికి వెళ్లగా.. కార్తికేయన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ తర్వాత గురువారం రాత్రి తిరిగి వచ్చి తలుపు కొట్టగా.. ఇంట్లో నుంచి చప్పుడు లేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి మరో తాళం చెవిని ఉపయోగించి లోపలికి వెళ్లగా.. కార్తికేయ కరెంట్ తీగ చుట్టుకుని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే 26 ఏళ్ల యువతి.. మహారాష్ట్రలోని పూణేలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా అనే కంపెనీలో పనిచేస్తుండగా.. తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఆమె అంత్యక్రియలకు కూడా ఆ కంపెనీ నుంచి ఎవరూ రాకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ విషయాన్ని మృతురాలి తల్లి చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. దీనిపై ఆ సంస్థ ఛైర్మన్ కూడా స్పందించారు. మరోవైపు.. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్రం.. ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…