ఏదీ సత్యం, ఎవరు సుందరం.. కార్తీనా..పవనా…

By KTV Telugu On 25 September, 2024
image

KTV TELUGU :-

ఒక అనవసర వివాదాన్ని ఇరు వర్గాలు చాకచక్యంగా చేయిదాటి పోకుండా జాగ్రత్త పడ్డాయి. తిరుపతి లడ్డూ వివాదంలో చాలా మంది తమ అభిప్రాయాలు చెబుతున్న తరుణంలో ఎలాంటి అభిప్రాయమూ చెప్పకుండానే ఇరకాటంలో పడిన తమిళ జెంటిల్మెన్ నటుడు కార్తీ.. ఎంతో తెలివిగా విషయం పెద్దది కాకుండా ఒక క్షమాపణతో సెటిల్ చేశారు. ఈ క్రమంలో కార్తీ కాస్త పైచేయిగా నిలిచినట్లుగా కూడా ఒక వర్గం భావిస్తున్న మాట వాస్తవం..

తాను నటించిన సత్యం సుందరం సినిమా ఈవెంట్ లో లడ్డూ వివాదాన్ని టచ్ చేయకుండా ఉండేందుకే కార్తీ ప్రయత్నించారు. యాంకర్ పదే పదే అడగడంతోనే “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్” అన్నారు. తను లడ్డూపై స్పందించనని కూడా అన్నారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. వివాదం అంతకంటే లేదు. కాకపోతే ఆ మాటను ఆయన నవ్వుతూ చెప్పారు. దానిలో కొంత శ్లేష, ఎగతాళి కొందరికి కనిపించి ఉండొచ్చు. అలాంటి ఎగతాళి పంచాంగానికి అవకాశం ఇవ్వకూడదని అనుకున్నారో ఏమో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాస్త గట్టిగానే స్పందించారు. అలా అనేకంటే ఒక రేంజ్ లో బదులిచ్చారనే చెప్పాలి. “మీరు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి. లేదంటే మౌనంగా కూర్చోండి. అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. లడ్డూని సెన్సిటివ్ ఇష్యూ అనకండి. ఒక్క కామెంట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించండి.” అంటూ పవన్ కల్యాణ్ క్లాస్ తీసుకున్నారు…

ఇప్పటికే తిరుపతి లడ్డూ వ్యవహారం జాతీయ స్థాయిలో వెళ్లిపోయింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్య కూడా గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానితో వెంటనే స్పందించిన కార్తీ.. ఎలాంటి మొహమాటాలు, భేషజాలకు పోకుండా సారీ చెప్పేశారు. “ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు..నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను. శుభాకాంక్షలు…” అంటూ సూటిగా సుత్తిలేకుండా స్పందించారు పవన్ ఎందుకు రియాక్ట్ కావాల్సి వచ్చిందన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. లడ్డూపై స్పందించనని కార్తీ చెప్పడంలో తప్పేమిటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. పవన్ కల్యాణ్ అవసరానికి మించి స్పందించారని వాదించిన వాళ్లూ ఉన్నారు.

ఏమనుకున్నారో ఏమో కార్తీ సారీ చెప్పిన తర్వాత పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆయన నటించిన సత్యం సుందరం సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ‘‘డియర్ కార్తీ గారూ.. సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని.. అలాగే మీ వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి లడ్డూతో పాటు.. మన పవిత్ర దేవాలయాలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల్లో లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలపై జాగ్రత్తగా స్పందించటం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే మీరు ఇది కావాలని చేసిందిగా నేను భావించడం లేదు.. ఆ పరిస్థితిలో అనుకోకుండా అలా జరిగిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. మీకు.. సూర్య, జ్యోతిక గార్లకు.. మరియు 2D ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ మొత్తానికి నా అభినందనలు. మీ ‘సత్యం సుందరం’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు కూడా కార్తీ వెంటనే రియాక్ట్ అయి, పవన్ కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతానికి కార్తీకి సంబంధించిన వివాదం సమసిపోయి ఉండొచ్చు, లడ్డూ వ్యవహారంలోనే ఇప్పుడు ప్రకాష్ రాజ్, పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫారిన్ లొకేషన్ షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్.. ఇండియా వచ్చిన తర్వాత స్పందిస్తానని ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు జనంలో వినిపిస్తున్న ప్రశ్నకు మాత్రం సమాధానం కూటమి ప్రభుత్వం నుంచే రావాలి. స్పందించను దేవుడా అని కార్తీ మొత్తుకుంటే…దానిపై ఆయన్ను ఎందుకు తప్పుపట్టారన్న ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు. బహుశా తిరుపతి లడ్డూ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో ఎవరూ స్పందించకూడదని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారేమో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి