కూటమి సర్కారు, వైసీపీకి మధ్య మరో షో డౌన్ రెడీ అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి తిరుమల పర్యటనను అడ్డుకోవాలని కూటమి సర్కారు భావిస్తోంది. శ్రీవారి లడ్డూకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ చేశారన్న నివేదికల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద వివాదమే నడుస్తోంది. తమ హయాంలో ఎలాంటి తప్పూ జరగలేదని వైసీపీ చెప్తోంది. టీటీడీ ముందు నుంచి అనుసరిస్తున్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించినట్లు చెప్తోంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను సైతం 18 సార్లు వెనక్కి పంపామని.. ఆ పార్టీ వాదన. ఇదిలా ఉన్న సమయంలోనే తప్పును క్షమించు స్వామీ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అటు కూటమి నేతలు సైతం ఆలయాలను సందర్శిస్తూ, సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే అధికార కూటమి నుంచి వస్తున్న విమర్శలు, ఆరోపణలకు దీటుగా బదులిస్తున్న వైసీపీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.మాజీ సీఎం ఆ రోజున తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నారు.
జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుని ఆయన్ను దోషిగా నిలబెట్టేందుకు కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది. ఆయన తిరుమల కొండ ఎక్కకుండా చూడాలన్నది వారి ధ్యేయంగా కనిపిస్తోంది. 28న జగన్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దేవునిపై నమ్మకం ఉందని అన్యమతస్తుడైన జగన్ సంతకం చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.ఇలాంటి డిమాండ్ చాలా మంది కూటమి నేతల వైపు నుంచి వినిపిస్తోంది. అసలు డిక్లరేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పూరించాలో కూడా మీడియాలో వీడియోలు పెడుతూ జగన్ కు సలహాలు ఇచ్చే వారూ ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ లీడ్ తీసుకుంటుందనే చెప్పాలి. జగన్ ను అలిపిరి వద్దే ఆపేసి…నిరసనలు నిర్వహించేందుకు బీజేపీ తిరుపతి విభాగం ప్లాన్ చేస్తోంది. వారికి టీడీపీ, జనసేన వైపు నుంచి మద్దతు వస్తోంది. దానితో వైసీపీ కూడా పోటీ నిరసనలు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. పోటాపోటీ నినాదాలతో అలిపిరి గేట్ దద్దరిల్లే అవకాశం ఉంది.
నిజానికి జగన్ రెడ్డి క్రైస్తవుడైనప్పటికీ సీఎం హోదాలో అనేక మార్లు తిరుమల వెళ్లారు. అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు ఆయన దిగిపోయిన తర్వాత, లడ్డూ వివాదం బయటపడటంతో కూటమి నేతలు అలెర్టయి.. పూర్తిగా దెబ్బకొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వారి చర్యలను వైసీపీ ఖండిస్తోంది. తిరుమలకు జగన్ వెళ్తున్నారంటేనే, ఆ కలియుగ దైవంపై నమ్మకంతోనే అని కూటమి నేతలు ఎందుకు గ్రహించడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇతర మతస్తులు తిరుమలకు రావడాన్ని ఆహ్వానించాల్సింది పోయి, డిక్లరేషన్, ఇతర సాకులతో రాజకీయం చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ నాయకుడు కొత్తగా ఇప్పుడే తిరుమలకు వెళ్లడం లేదని, ఎన్నోసార్లు ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తూ అడ్డుకుంటే ఊరుకునేది లేదని తగిన రీతిలో సమాధానం చెబుతామని అంటున్నారు.
తగ్గాలా… వద్దా.. వివాదం పెద్దది కాకుండా చూడాలా అని జగన్ రెడ్డి ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. ప్రకటించారు కాబట్టి వెళ్లక తప్పదు. వెళితే గొడవ కావడం ఖాయం. అలాగని జగన్ రెడ్డి మామూలోడు కాదు. గొడవలకు వెనుకాడే రకం కాదు. మరి పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…