హైడ్రా కూల్చివేతలు సమంజసమైనవేనా? హరీష్ రావు ఏమన్నారు

By KTV Telugu On 30 September, 2024
image

KTV TELUGU :-

హైడ్రా కూల్చివేతలపై బాధితులు తెలంగాణ భవన్ కి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. మీకు మేము ఉన్నామని సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు లు హామీ ఇచ్చిన నేపథ్యం లో ,మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్‌, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ పేదలకు ఇండ్లు లేకుండా చేయడటమే రేవంత్‌ లక్ష్యంగా ఉందన్నారు.

చెరువులు నాలాలూ ఆక్రమణకు గురయ్యాయని పెద్ద పెద్ద మాటలు చెప్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్ లో కట్టుకున్న ఇల్లు చెరువు కుంటలోనే ఉందని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని వాటిని కూల్చి ఆ తర్వాత పేదల ఇండ్ల జోలికి రావాలన్నారు. రేవంత్ రెడ్డి ఏదో సుద్దపూసలెక్క మాట్లాడుతుండు. కొడoగల్‌లో ఆయన కట్టుకున్న ఇల్లే చెరువు కుంటల ఉన్నది. రెడ్డి కుంటలో సర్వే నెంబర్ 1138లో రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. ఫస్టు నీ ఇల్లు కూలగొట్టుకో.. నీ ఇల్లు రెడ్డి కుంటల.. నీ తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నది. నీ తమ్మునికో రూల్.. నీకో రూల్.. గరీబోళ్లకో రూలా..? అని హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

హైడ్రా కూల్చివేతల పేరుతో నగర ప్రజల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. కూల్చివేతలు ఆపి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటంపై కాంగ్రెస్‌ దృష్టి సారించాలని హితవు పలికారు. మూసీని ఆక్రమించి భవనాలు కట్టినవారిని అడ్డుకోవట్లేదని.. పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను వదిలేసి.. ఈ బుల్డోజర్‌ రాజకీయాలేంటని ప్రశ్నించారు. కూల్చివేతలను ఉపేక్షించేంది లేదని.. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పారు. రేవంత్ సర్కార్ మీ ఇండ్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచంలా నిలబడతామని భరోసా ఇచ్చారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు.
ఇప్పుడు చెరువులు కుంటలు కాపాడుకోకపోతే ఇంకెప్పటికీ కాపాడలేమని, అనర్ధాలు జరిగితే చూస్తూ ఉండవలసి వస్తుందని , ఇల్లు కోల్పోయిన వారికి 30 లక్షల వరకు విలువ చేసే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని అధికారులు ప్రభుత్వం కూడా హామీ ఇస్తున్నారు కదా దీనిని రాజకీయం చేయవద్దని, కొంతమంది హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తున్నారు

అయితే బి ఆర్ ఎస్ నాయకులతో పాటు బిజెపి నాయకులు సైతం హైడ్రాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి